
వడ్లు తడవకుండా ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసే దిశగా చర్యలు
తొలిసారిగా ఈ సీజన్ నుంచే వడ్లు ఆరబెట్టే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి
8,332 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..75 ఎల్‌ఎంటీ కొనుగోలు అంచనా
మీడియా సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ డీఎస్.చౌహాన్
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వారీగా వాతావరణ హెచ్చరికలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఒక జిల్లాలోని మండల పరిధిలో ఉన్న ఓ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో వర్షాలు, పిడుగులు పడే పరిస్థితులు ఉంటే ముందే సదరు కేంద్రం సిబ్బందిని అలర్ట్ చేయడం ద్వారా రైతులు తీసుకొచ్చిన వడ్లు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారన్నారు.
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రణాళికను మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని క్షేత్రస్థాయి వరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
ధాన్యం తడవకుండా డ్రయ్యర్లు..ప్యాడీ క్లీనర్లు
దేశంలోనే తొలిసారిగా ధాన్యం ఆరబెట్టే యంత్రాలతోపాటు ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను వినియోగంలోకి తీసుకొస్తున్నట్టు చౌహాన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు, వడ్లు తడిసిన ప్రాంతాలకు తొలుత ఈ యంత్రాలను పంపించి రైతులకు తోడ్పాటు అందిస్తామన్నారు. వీటికి ప్రస్తుతం ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని, భవిష్యత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటే, డీజిల్‌కు అయ్యే ఖర్చును భరించేలా ప్రణాళిక రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నబియ్యాన్ని గుర్తించేందుకు డిజిటల్ మిషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్‌లో 18.75 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అని అంచనా వేయగా, ఇప్పటి వరకు 11.63 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. సన్న, దొడ్డు ధాన్యం సంచులను కుట్టేందుకు వినియోగించే దారం రంగులు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వరికోతకు వినియోగించే హార్వెస్టర్లకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
పూర్తిగా కోతకు రాని పంటలను ముందుగా కోయడం వల్ల వరి గింజ నాణ్యత దెబ్బతింటుందని, బ్లోయర్‌ను యాక్టివ్ మోడ్‌లో పెట్టకుండా డీజిల్ ఆదా చేసే పరిస్థితిని నిరోధించాలని వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రాష్ట్ర సరిహద్దుల్లో 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, అక్కడ సీసీ టీవీలు కూడా ఉంటాయన్నారు.
75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యిందని, ఉత్పత్తి అంచనా 159.15 లక్షల మెట్రిక్ టన్నులుగా చౌహాన్ పేర్కొన్నారు. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు.
అక్టోబర్ ఒకటో తేదీ కల్లా కొనుగోళ్లకు సిద్ధంగా ఉంటామని, అయితే అక్టోబర్‌లో 6.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (9%) మాత్రమే సేకరిస్తామన్నారు. అత్యధికంగా నవంబర్‌లో 32.95 లక్షల మెట్రిక్ టన్నులు (44%), డిసెంబర్‌లో 27.03 లక్షల మెట్రిక్ టన్నులు (36%) సేకరించనున్నట్టు తెలిపారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్రంలో 8,332 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
జిల్లాల వారీగా అత్యధికంగా నిజామాబాద్ నుంచి 6.80 లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు, నల్లగొండ నుంచి 4.76 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ హనుమంతు కొండిబా, అదనపు డైరెక్టర్ బి.రోహిత్‌సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.