మూసీనది ఆక్రమణలతోనే వరదలు 

Vice President Venkaiah Naidu Launches HPS Ramanthapur Golden Jubilee Celebrations - Sakshi

హెచ్‌పీఎస్‌ స్వర్ణోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు    

సాక్షి, హైదరాబాద్‌: మూసీనది ఆక్రమణలకు గురికావడం వల్లే హైదరాబాద్‌లో వర్షాలు కురిసినప్పుడు వరదలు పోటెత్తుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి చాలా ముఖ్యమైనదని, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని అన్నారు.

నదుల ఆక్రమణలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. దేశంలోని ఉన్నతమైన విద్యాసంస్థల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఒకటని కొనియాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, కృషితోనే మంచి భవిష్యత్‌ సాధ్యమని విద్యార్థులకు సూచించారు. 

వ్యాయామం అవసరం 
శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని వెంకయ్యనాయుడు సూచించారు. యోగా అనేది మోదీది కాదని, వ్యాయామానికి కులమతాల భేదాలు లేవని అన్నారు. సంగీతం, సాహిత్యం రోజువారీ జీవితంలో భాగం కావాలని, ప్రకృతిని, సంస్కృతిని ఆరాధిస్తూ జీవితాన్ని సాఫీగా గడపాలన్నారు. చదువు కోసం చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, అనంతరం దేశం కోసం పనిచేయడానికి తిరిగి రావాలన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నర్సింహారెడ్డి, హెచ్‌పీసీ అధ్యక్షుడు శ్యామ్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top