
మెట్‌పల్లి మండలం వెల్లుల ఎల్లమ్మ ఆలయానికి భక్తుల తాకిడి
ప్రసిద్ధ ఆలయంగా పేరు
ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్న భక్తులు
జగిత్యాల జిల్లా: మంగళవారం వస్తే చాలు.. ఆ ఆలయంలో భక్తుల సందడి ఉంటుంది. ఆ రోజు జరిగే జాతరకు భక్తజనకోటి తరలి వస్తుంది. ఆ విశిష్ట ఆలయం మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో ఉంది. ఇక్కడి ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి మంగళవారం జరిగే జాతరకు విశేషంగా భక్తులు తరలి వస్తున్నారు. గ్రామ శివారులో రహదారి పక్కనే చెట్టు రూపంలో ఉన్న ఈ ఆలయానికి.. ఇటీవలి కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి మంగళవారం ఇక్కడ జాతర జరగడం విశేషం. ఇక్కడి ఎల్లమ్మకు ఎన్నో మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి వారం జరిగే జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా.. ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
సుమారు 300 ఏళ్ల క్రితం..
ఎక్కడైనా ఆలయంలో దేవుడు, దేవత ఉండడం.. భక్తులు పూజిస్తుండటం సహజం. కానీ ఇక్కడ చెట్టునే దైవంగా భావించి పూజలు చేస్తున్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామ శివారులోని ఒక చెట్టు కింద.. సుమారు 300 ఏళ్ల క్రితం ఎల్లమ్మ తల్లి వెలసింది. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం వద్ద ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ప్రతి వారం జరిగే జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ జిల్లాలు, మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్నారు. అమ్మవారికి బెల్లం, పుటా్నలు, కల్లు సమరి్పంచి కోళ్లు, పొట్టేళ్లను బలిస్తున్నారు. కుటుంబ సమేతంగా వంటలు చేసుకొని సహపంక్తి భోజనం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే జనాలతో ఈ ప్రాంతమంతా ప్రతి మంగళవారం సందడిగా మారుతుంది.
బావినీటితో స్నానం ఆరోగ్యకరం
ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులు అక్కడి బావి నీటితో స్నానం చేస్తారు. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో భక్తులు బావిలోని నీటిని వెంట తీసుకెళ్తారు. పంటలు వేసే ముందు అమ్మవారిని దర్శించుకొని వెళ్తే బాగా పండుతాయని రైతులు నమ్ముతుంటారు.
దేవాదాయశాఖ పరిధిలోకి..
సుమారు 40 ఏళ్లుగా వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఎల్లమ్మ ఆలయాన్ని కొన్ని నెలల క్రితం ప్రభుత్వం దేవాదాయశాఖలోకి విలీనం చేసింది. దీంతో ప్రతి మంగళవారం జరగనున్న జాతర రోజు దేవాదాయశాఖ అధికారులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ప్రతి మంగళవారం మెట్‌పల్లి–వెల్లుల రహదారిలో వాహనాల సంఖ్య సైతం పెరిగింది. దీంతో పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేసి రాకపోకలు సాఫీగా జరిగేలా చూస్తున్నారు.