'సరిపడా నిల్వలున్నప్పుడే వ్యాక్సినేషన్‌' | Vaccination Only When There Are Adequate Stock Director Of Public Health | Sakshi
Sakshi News home page

సరిపడా నిల్వలున్నప్పుడే వ్యాక్సినేషన్‌: ప్రజారోగ్య విభాగం సంచాలకుడు

May 19 2021 3:41 AM | Updated on May 19 2021 3:43 AM

Vaccination Only When There Are Adequate Stock Director Of Public Health - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతానికి 3 లక్షల కోవాగ్జిన్‌ డోసులు అవసరమని, కానీ వైద్య,ఆరోగ్య శాఖ వద్ద కేవలం 50 వేల డోసులు మాత్రమే ఉన్నాయని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. చాలినన్ని డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వాయిదా వేశామన్నారు. టీకా డోసులు సంతృప్తికరంగా ఉన్నప్పుడు సమాచారమిచ్చి వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని, అప్పటివరకు ఆగాల్సిందేనని స్పష్టంచేశారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి తగ్గుతోందని, సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న వ్యూహాత్మక కార్యాచరణతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పాజిటివిటీ, డెత్‌ రేటు తక్కువగా ఉందన్నారు.

రికవరీ రేటు 90 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా పడకలు ఖాళీగా ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులు, చికిత్సపై ఇప్పటివరకు 26 ఫిర్యాదులు వచ్చాయని, తాజాగా నాలుగు ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇందులో మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రికి కోవిడ్‌–19 చికిత్స అనుమతిని రద్దు చేసినట్లు వివరించారు. కరోనాను ఎదుర్కోవడమంటే ఎక్కువ పరీక్షలు చేయడం కాదని, సకాలంలో చికిత్స చేయడమని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా చెబుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానాన్ని అనుసరిస్తోందన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ కొత్త వ్యాధి కాదని, వీటికి కోఠిలోని ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స ఇస్తున్నట్లు వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు. హౌస్‌సర్జన్, పీజీ డాక్టర్లకు ఉపకారవేతనాలు 15% పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రెండు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 604 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందు కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement