కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గోదావరి వరద జలాల మళ్లింపు చట్టవిరుద్ధం
ఏపీ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం
కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ వినతి
ఆల్మట్టి ఎత్తు పెంపును, భూసేకరణను అడ్డుకోవాలని అభ్యర్థన
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోమారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఏపీ ఏ పేరుతో ఆ ప్రాజెక్టు చేపట్టినా ముందుకెళ్లకుండా నిలువరించాలని అభ్యర్థించారు. గోదావరి వరద జలాల మళ్లింపు పూర్తిగా చట్టవిరుద్ధమని, ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చెప్పారు. మంగళవారం ఇక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్రమంత్రితో ఉత్తమ్ భేటీ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించడంతో పాటు రాష్ట్ర ప్రాజెక్టులకు దక్కాల్సిన అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు.
మిగులు జలాల ప్రస్తావనే లేదు..: ‘1980లో బచావత్ ట్రిబ్యునల్ గోదావరి ‘మిగులు జలాలు’, ‘వరద జలాలు’అనే పదాలను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అందువల్ల బనకచర్ల ద్వారా మిగులు జలాలను మళ్లిస్తామనడం పూర్తిగా చట్టవిరుద్ధం. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ నివేదిక (పీఎఫ్‌ఆర్)పై తెలంగాణ ఇప్పటికే అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. మహారాష్ట్ర కూడా తమ రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతంలో విస్తారమైన కరువు ప్రాంతాలు ఉన్నాయని, ఆ ప్రాంతాలకు వరద నీటిని మళ్లించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మరోపక్క కర్ణాటక.. బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నీటిని మళ్లించడానికి బదులుగా కృష్ణా నదిలో సుమారు 112 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటామని తెలిపింది.
ఇవన్నీ తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో ఎగువ రాష్ట్రాల అదనపు నీటి వినియోగం కారణంగా దిగువ తెలంగాణకు చేరుకునే ప్రవాహాలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు కేంద్ర పరిధిలోని చట్టబద్ధ సంస్థలు అనేక అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత నెల 3వ తేదీన ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. గోదావరి వరద జలాల మళ్లింపు చట్టవిరుద్ధమైనందున ప్రాజెక్టు ఏ రూపంలో, ఏ పేరుతో వచ్చినా దానిని అడ్డుకోవాలి..’అని ఉత్తమ్ కోరారు.
ఆల్మట్టి విషయంలో కర్ణాటకను నిలువరించండి
‘ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 524.25 మీటర్లకు పెంచకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కర్ణాటక ఎత్తు పెంపునకు అనుగుణంగా భూసేకరణ చేస్తోంది. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపుతో దిగువన తెలంగాణలో కృష్ణా జలాల లభ్యత ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. అందువల్ల కర్ణాటకను నిలువరించాలి.
⇒ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు అవసరమైన అనుమతుల కోసం తెలంగాణ ఇదివరకే కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు అనుమతుల్లో జాప్యంతో ఖర్చు పెరుగుతోంది. అందువల్ల ఇందులోని 45 టీఎంసీలను చిన్న నీటి వనరుల నుంచి వాడుకునేందుకు క్లియరెన్స్‌లు ఇచ్చేలా కేంద్ర జల సంఘాన్ని ఆదేశించండి.
⇒ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను సంబంధిత అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి ఇదివరకే సమర్పించాము. దీని క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీడబ్ల్యూసీకి సూచించండి. ప్రస్తుతం కృష్ణా జలాలపై విచారణ కొనసాగిస్తున్న కేడబ్ల్యూడీటీ–2 తన విచారణలను త్వరగా పూర్తి చేసేలా సూచించండి. ఏఐబీపీ కింద 2026–2031 వరకు ప్రాణహిత –చేవెళ్ల, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు, ఇంటిగ్రేటెడ్ సీతారామ, సీతమ్మ సాగర్, పాలమూరు–రంగారెడ్డి, ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం), మోదికుంటవాగు, చనాకా–కొరాట ప్రాజెక్టులకు ఆరి్ధక సాయం అందించాలి..’అని ఉత్తమ విజ్ఞప్తి చేశారు.
టెండర్లు రద్దు చేసి మళ్లీ..: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం–బనకచర్ల ప్రీ ఫీజబిలిటీ సర్వే సమయంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఏపీ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది. అయితే మళ్లీ ప్రాజెక్టు పేరు, టెరి్మనల్ పాయింట్ మార్చి కొత్తగా గోదావరి మళ్లింపు జలాలను తరలించే ప్రక్రియ మొదలు పెట్టిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించాం. తెలంగాణ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆల్మట్టి ఎత్తు విషయంలో న్యాయ పోరాటం చేస్తాం..’అని చెప్పారు.


