
ధాన్యం కొనుగోలు కోటాను పెంచి, డెలివరీ నిబంధనలు సడలించండి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రికార్డుస్థాయిలో అత్యధికంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం తక్షణమే కొనుగోలు కోటాను పెంచి, డెలివరీ నిబంధనలు సడలించి అదనపు గోదాములు, రైళ్ల సదుపాయం కల్పించాలని కోరారు. ‘ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఒకే సీజన్‌లో ఈస్థాయిలో వరి కొనుగోలు చేయలేదు.
గత రికార్డు 67 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈసారి 80 లక్షల టన్నులు కొనుగోలు అవుతాయి. అందులో 45–50 లక్షల టన్నులు సన్నాలు, 30–35 లక్షల టన్నులు దొడ్డురకాలు’ అని ఉత్తమ్ చెప్పారు. వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,389గా ఉండటంతో ఖర్చు రూ.20 వేల కోట్లకుపైగా అవుతుందని, బోనస్, రవాణా వ్యయాలు కలిపి రూ.24–26 వేల కోట్లు అవుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఒకే పంటకు ఇంత భారీగా ఖర్చు చేయలేదని స్పష్టంచేశారు.
సీఎంఆర్ డెలివరీపై అభ్యంతరం
కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ గడువు నవంబర్ 12 వరకు పొడిగించినా, కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వాలని కేంద్రం ఆదేశించడంపై ఉత్తమ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఖరీఫ్ వరి రా రైస్‌కి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం 7.80 లక్షల టన్నుల రా రైస్ మిల్లర్ల వద్ద ఉంది. 1.67 లక్షల టన్నుల వరి (సుమారు 1.13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్) మాత్రం బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ఉంది.
రా, బాయిల్డ్ రైస్ రెండూ అందించేలా అనుమతించాలి. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్‌కి మార్చాలి’ అని చెప్పారు. ఇక ఖరీఫ్ 2024–25 నుంచి 5.44 లక్షల టన్నుల సీఎంఆర్, రబీ 2024–25 నుంచి 14.92 లక్షల టన్నుల సీఎంఆర్ ఇంకా డెలివరీ కాని స్థితిలో ఉన్నాయన్నారు. దీనివల్ల మిల్లులు మూతపడటంతో కూలీలు పనిలేక వదిలి వెళ్తున్నారని తెలిపారు.
గోదాముల సంక్షోభం
రాష్ట్రంలో ఎఫ్‌సీఐ నిల్వ సామర్థ్యం 22.61 లక్షల టన్నులు కాగా, ఇప్పటికే 21.72 లక్షల టన్నులు నిండిపోయి, కేవలం 0.89 లక్షల టన్నుల పట్టే స్థలం మాత్రమే ఖాళీగా ఉందని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. నెలకు కనీసం 300 రైళ్లు అదనంగా కేటాయించి గోదాములు ఖాళీ చేయాలని, అదనపు గోదాములను ఎఫ్‌సీఐ అద్దెకు తీసుకోవాలని చెప్పారు. 2025–26 కొనుగోలు సీజన్‌లో వరి ఉత్పత్తి 148.30 లక్షల టన్నులుగా అంచనా వేసినప్పటికీ, కేంద్రం కేవలం 53.73 లక్షల టన్నుల వరి (36 లక్షల టన్నుల బియ్యం) కొనుగోలుకే ఆమోదం తెలిపిందన్నారు.
‘10 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేయాలి. మొత్తం లక్ష్యాన్ని 80 లక్షల టన్నుల వరి (53.60 లక్షల టన్నుల బియ్యం)కి పెంచాలి. లేకుంటే రైతులు నష్టపోతారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద బియ్యాన్ని కిలోకు రూ.24కి అమ్ముతున్నందున, రైతులు పంటను కేవలం రూ.16–17కే విక్రయించాల్సి వస్తోందని, దీంతో ప్రైవేట్ కొనుగోళ్లు దెబ్బతింటున్నాయని ఉత్తమ్‌కుమార్ అన్నారు.