
ఎనిమిది జిల్లాలకు యూరియా కేంద్రం
దిగుమతుల్లేక అత్తెసరు నిల్వలకే పరిమితం
గజ్వేల్: తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు యూరియా సరఫరా కేంద్రంగా ఉన్న గజ్వేల్ రేక్ పాయింట్ ప్రస్తుతం అత్తెసరు నిల్వలకే పరిమితమవుతోంది. రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉంచడానికి గజ్వేల్‌లో 2022 జూన్ 27న రేక్ పాయింట్‌ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రేక్ పాయింట్లకు ఇది అదనం. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, ఈ లైన్‌పై గజ్వేల్ రైల్వేస్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ వద్ద రేక్ పాయింట్ ఏర్పాటు చేశారు.
పలు పోర్టుల నుంచి ఇక్కడి రైలు మార్గంలో....
గజ్వేల్ రేక్ పాయింట్‌కు తమిళనాడు రాష్ట్రంలోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి రైలుమార్గం ద్వారా కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా నిల్వలు వస్తాయి. ఇలా వచ్చిన నిల్వలను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రితోపాటు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు కేటాయింపుల వారీగా వ్యవసాయశాఖ సరఫరా చేస్తున్నది. గతంలో ఇక్కడకు ఎన్‌ఎఫ్‌సీఎల్ (నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్), సీఐఎల్ (కోరమాండల్ ఇంటర్నేషనల్ కెమికల్), ఇఫ్‌కో తదితర కంపెనీలకు చెందిన యూరియా వచ్చేది. కానీ ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి యూరియా బంద్ కాగా, మిగిలిన కంపెనీల ఉత్పత్తులు వస్తున్నాయి.
గతంలో భారీగా నిల్వలు.
రేక్ పాయింట్‌ను ప్రారంభించిన 2022–23 సంవత్సరంలో 15 నుంచి 20 వరకు రేక్‌ల నిల్వలు వచ్చాయి. ఒక్కో రేక్ సామర్థ్యం 1,400 మెట్రిక్ టన్నులు. ఇలా ఆ ఏడాది సుమారుగా 21 వేల మెట్రిక్ టన్నుల నుంచి 28 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు వచ్చి...ఆయా జిల్లాలకు సరఫరా అయ్యాయి.
2024–25లో 10 రేక్‌లకు పైగా వచ్చాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం మూడు రేక్‌లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సీజన్‌లో కేవలం ఇక్కడకు 4,200 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దీనివల్ల ఆయా జిల్లాలకు సరఫరా అయ్యే యూరియాలో తీవ్రమైన కోత పడింది. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా యూరియా దిగుమతులు నిలిచిపోవడం వల్ల ఇక్కడకు రావాల్సిన నిల్వల్లో కోత పడింది.
యూరియా టోకెన్‌ల కోసం రైతుల ఆందోళన
కేసముద్రం: యూరియా బస్తాల టోకెన్‌ల కోసం రైతులు గంటల తరబడి బారులుదీరిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఆదివారం జరిగింది. కేసముద్రం, ధన్నసరి సొసైటీలకు 20 టన్నుల యూరియా వస్తుందనే సమాచారంతో.. ఉదయం 7 గంటలకు రైతులు పీఏసీఎస్‌ల వద్దకు చేరుకున్నారు. కేసముద్రం రైతు వేదిక భవనంలో యూరియా టోకెన్‌లు ఇస్తున్నట్లు అధికారులు ఇచ్చిన సమాచారంతో అధిక సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకొని క్యూలో నిల్చున్నారు. 444 బస్తాలకు గాను ఏవో వెంకన్న, పోలీసుల ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున టోకెన్‌లు ఇచ్చారు.
వెయ్యి మందికి పైగా రైతులు మధ్యాహ్నం వరకు క్యూలైన్‌లో నిల్చొని పడిగాపులు పడినా, 444 బస్తాలకు మాత్రమే టోకెన్ ఇవ్వడంతో మిగిలిన రైతులంతా నిరాశతో వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 222 బస్తాల పంపిణీకి అధికారులు టోకెన్‌లు ఇచ్చేందుకు కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పెద్దసంఖ్యలో చేరుకున్న రైతులు బారులు దీరారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో టోకెన్‌ల పంపిణీ నిలిపివేశారు. అనంతరం రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.
అవసరానికి మించి యూరియా కొనొద్దు
ముందస్తు సాగుతో పెరిగిన యూరియా వాడకం
రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సరఫరా చేయని కేంద్రం
చాలా రాష్ట్రాల్లో యూరియా కొరత ఉందని బీజేపీ అధ్యక్షుడికి తెలియదు
వ్యవసాయశాఖ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్న మాటలకు ఆందోళనకు గురై అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన యూరియాను పకడ్బందీగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం సచివాలయంలో మంత్రి తుమ్మల వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా లభ్యతపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయకుండా చైతన్యపరచాలని చెప్పారు. వానాకాలం సీజన్‌కు కేంద్రం కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఈనెల వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటంతో ఏర్పడిన యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆదేశించారు.
సీజన్ ముందస్తుగా ప్రారంభం కావడం, మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు చేయడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా అమ్మకాలు కూడా అధికంగా జరిగాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నల్లగొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిల్లాలలో గత సంవత్సరంతో పోలిస్తే యూరియా అమ్మకాలు అధికంగా జరిగినట్టు తెలిపారు. యూరియాను వ్యవసాయానికి కాకుండా, ఇతర అవసరాల కోసం మళ్లించకుండా టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసి, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఏ రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదని, ఇక్కడే ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు అవగాహనరాహిత్య మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాస్తవానికి మన రాష్ట్రంలోనే కాకుండా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్తాన్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందన్నారు.
వ్యవసాయ శాఖ సంచాలకులు బి.గోపి మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సీజన్‌కు ముందే కేంద్రం ఎరువులను కేటాయిస్తుందని, అందులో భాగంగానే తెలంగాణకు కూడా యూరియాతో కలిపి 5 రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని అన్నారు. ఇందులో యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ కలిపి 13.95 మెట్రిక్ టన్నులుగా ఉన్నట్టు తెలిపారు. అయితే కేటాయించిన యూరియాను నెలవారీగా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం వల్ల సమస్య ఎదురైందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హాకా ఎండీ చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు.