మంగళూరు పోర్ట్‌ టు సికింద్రాబాద్‌ | Union Cabinet approves connectivity of Mangalore Port with Secunderabad | Sakshi
Sakshi News home page

మంగళూరు పోర్ట్‌ టు సికింద్రాబాద్‌

Jun 12 2025 3:50 AM | Updated on Jun 12 2025 3:50 AM

Union Cabinet approves connectivity of Mangalore Port with Secunderabad

అనుసంధానించేందుకు రూ.3,342 కోట్లతో బళ్లారి–చిక్జాజూర్‌ రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు

కేంద్ర మంత్రివర్గం ఆమోదం: అశ్వినీ వైష్ణవ్‌

సాక్షి, న్యూఢిల్లీ: మంగళూరు పోర్ట్‌ను సికింద్రాబాద్‌తో అనుసంధానించే ముఖ్యమైన బళ్లారి– చిక్జాజూర్‌ రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3,342 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు 185 కిలో మీటర్ల పొడవుతో ఉంటుంది. ప్రస్తుతం సికింద్రా బాద్‌ నుంచి కృష్ణపట్నం పోర్టుకు మాత్రమే రైలు మార్గం ఉండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో కొత్తగా మంగళూరు పోర్టును సికింద్రాబాద్‌తో అనుసంధానిస్తారు. 

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) రెండు కీలక రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్‌లోని కొడర్మా– బర్కాకానా డబ్లింగ్‌ ప్రాజె క్టు, బళ్లారి–చిక్జాజూర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సౌలభ్యం, సామగ్రి రవాణా సామర్థ్యం, తక్కువ లాజిస్టిక్‌ ఖర్చుతో సహజంగా కార్బన్‌ ఉద్గారాల తగ్గింపుతో ఉన్న మౌలిక వ్యవస్థను బలపరచనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.6,405 కోట్లు. ఈ రెండు కీలక ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

బళ్లారి–చిక్జాజూర్‌ ప్రాజెక్టు ఇలా...
బళ్లారి–చిక్జాజూర్‌ రైలు డబ్లింగ్‌ ప్రాజెక్టు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా సాగుతుంది. 185 కి.మీ. మార్గంలో 19 స్టేషన్లు, 29 మెయిన్‌ బ్రిడ్జీలు, 230 మైనర్‌ బ్రిడ్జీలు, 21 ఆర్వోబీలు, 85 ఆర్‌యూబీలు ఉంటాయి. ఈ డబ్లింగ్‌ ప్రాజెక్టు ఇనుము ధాతువు, కోక్‌ కోల్, స్టీల్, ఎరువులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం పదార్థాల రవాణాకు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు వల్ల 470 గ్రామాలకు మెరుగైన రవాణా సేవలు, 13 లక్షల జనాభాకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. 

ఏటా 18.9 మిలియన్‌ టన్నుల అదనపు సరుకు రవాణాకు వీలవడమే కాకుండా ఈ మార్గం వల్ల ప్రతి సంవత్సరం 101 కోట్ల కిలోల కార్బన్‌డైఆక్సైడ్‌ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది. ఈ నూతన ప్రాజెక్టు వల్ల దాదాపు 20 కోట్ల లీటర్ల డీజిల్‌ పొదుపు అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement