
చర్లపల్లి–నాందేడ్, నాంపల్లి–పుణె మధ్య సర్వీసులు
మంజూరు చేసిన రైల్వే బోర్డు..త్వరలో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. ఇవి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. నాంపల్లి– పుణె నగరాల మధ్య ఇటీవలే ప్రతిపాదించిన వందేభారత్ రైలును తాజాగా మంజూరు చేసిన రైల్వే బోర్డు, చర్లపల్లి–నాందేడ్ మధ్య కూడా కొత్త సర్వీసు నడిపేందుకు పచ్చజెండా ఊపింది.
నాందేడ్, పుణె నగరాలకు హైదరాబాద్ నుంచి కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు నడవబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. కొత్తగా చేరే రెండుతో ఆ సంఖ్య ఏడుకు పెరుగుతుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌లకు ఒకటి చొప్పున వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
అనూహ్యంగా నాందేడ్‌కు...
ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 600 కి.మీ., అంతకుమించిన దూరం ఉన్న ప్రాంతాలకు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ, నగరం నుంచి కేవలం 281 కి.మీ. దూరంలోనే ఉన్న నాందేడ్‌కు అనూహ్యంగా వందేభారత్ రైలు మంజూరు కావటం విశేషం. దీర్ఘకాల ప్రతిపాదన అంటూ లేకుండా ఉన్నట్టుండి ఇది మంజూరైంది. మహారాష్ట్రలో ఉన్నా, నాందేడ్ ప్రజలు వివిధ అవసరాలకు ఎక్కువగా హైదరాబాద్‌కే వస్తారు.
అక్కడి వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు కూడా ఎక్కువ. అందుకే హైదరాబాద్–నాందేడ్ మధ్య సాధారణ రైళ్లు, బస్సులు అధికం. దీనికితోడు అదే మార్గంలో ఉన్న నిజామాబాద్ పట్టణం నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ. రాష్ట్రంలో మరే పట్టణానికి లేనన్ని రాజధాని కేటగిరీ బస్సు సర్వీసులు నిజామాబాద్‌కే తిరుగుతుంటాయి. నిజామాబాద్ నుంచి నిత్యం విమానాశ్రయానికి కూడా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు నడిపితే నిజామాబాద్, దాని పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే శాఖ భావించింది.
ఇక ఇదే మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు హైదరాబాద్ నుంచి వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. దీంతో నాందేడ్ వాసులకు హైదరాబాద్‌తో ఉన్న లావాదేవీల బంధం, నిజామాబాద్, బాసర ప్రాంతాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అనూహ్యంగా ఈ రైలు సర్వీసును మంజూరు చేశారు. నగర శివారులోని చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈ సర్వీసు నడవనుంది. కేవలం నాలుగు గంటల లోపే అది గమ్యం చేరుతుంది. దీంతో అవసరమైతే రోజుకు రెండు ట్రిప్పులు కూడా తిరిగే వీలుంటుంది. ప్రస్తుతానికి ఒక ట్రిప్పుతోనే సరిపెట్టనున్నారు.
ఇక హైదరాబాద్–పుణె నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ రెండు నగరాల మధ్య 17 రైళ్లు నడుస్తుండటం విశేషం. వీటిల్లో నాలుగు రైళ్లు ప్రతిరోజూ తిరుగుతుండగా, శతాబ్ది సర్వీసు వారంలో ఆరు రోజులు తిరుగుతోంది. రెండు రైళ్లు వారంలో మూడు రోజులు, రెండు రైళ్లు రెండు రోజులు, 8 రైళ్లు వారంలో ఒక రోజు చొప్పున తిరుగుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా వందేభారత్ కూడా జతకూడనుంది.
రెండు నగరాల మధ్య 592 కి.మీ. దూరం ఉంది. సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 11 గంటల నుంచి 13 గంటల సమయం తీసుకుంటున్నాయి. శతాబ్ది రైలు 8.30 గంటలు, దురొంతో 8.45 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ నిడివిని నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8 గంటల్లో చేరుకోనుంది.