
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు.
ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.
జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది.