సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో టీవీ5 సీఈవో మూర్తికి చుక్కెదురైంది. హీరో ధర్మమహేష్ పెట్టిన కేసుపై స్టే ఇవ్వాలని టీవీ5 మూర్తి హైకోర్టును ఆశ్రయించారు. ధర్మ మహేష్ వాదనలు వినకుండా స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టపరంగా ముందుకెళ్లాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
10 కోట్లు డిమాండ్..
కాగా, మూర్తి తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. లేకపోతే ప్రైవేటు వీడియోలు బయటపెడతానని వేధింపులకు గురిచేస్తున్నారని.. ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో వర్దమాన సినీనటుడు కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్.. పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో మహేశ్ ఫిర్యాదును, ఆయన సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు.. మూర్తితోపాటు మహేశ్ భార్య గౌతమిపై బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 308 (3), ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 72 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం..
మహేశ్ ఫోన్‌ను మూర్తి చట్టవిరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారు. ఆయన ప్రైవేట్ సంభాషణల్ని సైతం రికార్డు చేసి టీవీ5లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న చిరుమామిళ్ల గౌతమి, మూర్తి కలిసి మహేశ్, ఆయన తండ్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రికార్డు చేసి టీవీ5 చానల్‌లో ప్రసారం చేశారు. ఈ చట్టవిరుద్ధ ప్రసారం ద్వారా మహేశ్ వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబాన్నీ అవమానించడంతోపాటు మానసిక వేదనకు గురి చేసి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారు.
ఆ తర్వాత కూడా మూర్తి మహేశ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను స్పై కెమెరాలతో రికార్డు చేశారు. వాటిని అడ్డం పెట్టుకుని గౌతమి, మూర్తి రూ. 10 కోట్లు ఇవ్వాలని లేదా మహేశ్ వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మండిలో యాజమాన్య హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే ఫోన్ రికార్డింగ్‌లు, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, టీవీ5లో ప్రసారం చేస్తామని మహేశ్‌ను బెదిరించారు.


