అందరికీ ‘ఆర్టీసీ’ వైద్యం! 

 TSRTC Road Transport Company Decision Over Hospital Upgrade - Sakshi

రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం 

మల్టీ స్పెషాలిటీగా హాస్పిటల్‌ స్థాయి పెంపు 

అందరికీ మెరుగైన వైద్యం.. అదే సమయంలో ఆదాయం 

సన్నాహాలు ప్రారంభించిన ఆర్టీసీ 

సాక్షి, హైదరాబాద్‌: తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిలో సాధారణ ప్రజలకూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైద్యం అందిస్తోంది. తాజాగా దీనిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు వసతులు మెరుగుపరచాలని, ఇతరులకు కూడా వైద్యం అందించేలా రూపొందించాలని భావిస్తోంది.

విశాలమైన ప్రాం గణం, పెద్ద భవనాలు అందుబాటులో ఉన్నందున, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ భావిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిస్తే.. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, అదే సమ యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా సమకూరుతుందనేది ఆలోచన. కాగా ఈ ప్రక్రియను క్రమంగా పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు.

సరిపడ నిధులు, పర్యవేక్షణ లేక పడక 
ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్యాన్ని అందించిన ఈ ఆసుపత్రి ఆ తర్వాత పర్యవేక్షణ లేక పడకేసింది. చాలినన్ని నిధులు లేక వసతులు కూడా మృగ్యమయ్యాయి. క్రమంగా వైద్యుల కొరత ఏర్పడింది. కావాల్సిన మందుల సరఫరా లేక బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

మెరుగైన వైద్యం అందక రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్‌ చేయాల్సి వచ్చింది. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల మేర రెఫరల్‌ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఒక్క సంవత్సరంలో చెల్లించే రెఫరల్‌ బిల్లులను ఆసుపత్రిపై వెచ్చిస్తే అది మెరుగ్గా మారుతుందన్న ఆలోచన లేకుండా వ్యవహరించారు.  

ప్రభుత్వంపై ఆధార పడకుండా.. 
తాజాగా దీనావస్థలో ఉన్న ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. భవనాన్ని విస్తరించి అదనంగా బెడ్లను పెంచి ల్యాబ్‌ను విస్తరించటం ద్వారా వైద్య సేవలను కార్పొరేట్‌ స్థాయికి తేవాలని నిర్ణయించారు. దీనికి భారీగా నిధులు అవసరం కానున్నాయి.

అయితే ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) విధానం ద్వారా నిధులు సమకూర్చు కోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆక్సిజన్‌ ప్లాంట్‌ సిద్ధమైంది. ల్యాబ్‌లో పరీక్షలు 24 గంటలూ నిర్వహించటం, మందుల కౌంటర్‌ను నిర్విరామంగా తెరిచి ఉంచటం లాంటి వాటిని ప్రారంభించారు. ఇటీవలే డయాలసిస్‌ కేంద్రాన్ని మొదలుపెట్టారు.  

త్వరలో సహాయ సిబ్బంది నియామకం 
ఆస్పత్రిలో 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 16 మందే సేవలందిస్తున్నారు. దీంతో నలుగురిని కొత్తగా నియమించుకుని, మరో ఐదుగురు ప్రైవేటు వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక 60 మంది సహాయ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోబోతున్నారు. ఇందులో నర్సులు, డయాలిసిస్‌ టెక్నీషియన్లు, మల్టీ పర్పస్‌ వర్కర్ల పోస్టులు ఉన్నాయి.

సంస్థ ఎండీ సజ్జనార్‌ బుధవా రం వరకు సెలవులో ఉన్నారు. గురువారం ఆయన అనుమతితో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఆధునిక వైద్య పరికరాలు, బెడ్లకు కావాల్సిన నిధుల సమీకరణ జరుగుతోంది. కోవిడ్‌ సెంటర్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు.  

విశ్రాంత సర్జన్‌ ఆధ్వర్యంలో.. 
గతంలో గాంధీ ఆసుపత్రిలో కీలక పోస్టులో కొన సాగి పదవీ విరమణ పొందిన ఓ సర్జన్‌కు తార్నాక ఆసుపత్రి విస్తరణ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన కొద్ది రోజులుగా దగ్గరుండి దీనిని నిర్వహిస్తున్నారు. కన్సల్టెన్సీ తరహాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సూచనలు అందిస్తోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top