రైల్వే–ఆర్టీసీ కలసి సరుకు రవాణా!

TSRTC Railway Is Moving Towards To Transportation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ–రైల్వేలు కలసి సరుకు రవాణా దిశగా అడుగులు వేస్తున్నాయి. టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ విభాగం ఏర్పడ్డా, ఇంతకాలం పెద్దగా ఆదాయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో మార్చి ఆదాయాన్ని పెంచేలా ఎండీ సజ్జనార్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే కార్గో విభాగానికి జీవన్‌ప్రసాద్‌ అధికారిని బిజెనెస్‌ హెడ్‌గా నియమించారు.

ఇటీవలే కర్ణాటకలో, అక్కడి ఆర్టీసీ కార్గో విభాగం పని తీరును పరిశీలించి వచ్చిన ఆయన, తాజాగా రైల్వేతో అనుసంధానంపై కసరత్తు ప్రారంభించారు.  దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ విద్యాధర్‌రావుతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్గో బిజినెస్‌ హెడ్‌ జీవన్‌ప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఈ మేరకు రైల్వే–ఆర్టీసీ సరుకు రవాణా అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

ఏంటీ ఆలోచన...: కొంతకాలంగా సరుకు రవాణాను మరింత పటిష్టం చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈమేరకు వివిధ సం స్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీతో కూడా ఒప్పందంపై యోచిస్తోంది. ప్రస్తుతం నిర్ధారిత స్టేషన్ల నుంచి సరుకు రవాణా అవుతోంది. ఆయా స్టేషన్‌ల వరకు సరుకును బుక్‌ చేసినవారే తెచ్చి రైల్వేకు అప్పగించాల్సి ఉంది. ఇది పెద్ద లోటుగా ఉంది.

దీనిని ఆర్టీసీ భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది. పార్శిల్స్‌ బుక్‌ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపారకేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో  సిబ్బంది వెళ్లి సరుకును సేకరిస్తారు. అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు. సరుకును నిర్ధారిత రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైల్వే సిబ్బందికి అప్పగిస్తారు. దీనివల్ల సరుకు బుక్‌ చేసుకున్న వారికి దాన్ని స్టేషన్‌ వరకు తరలించే భారం తప్పుతుంది. ఆ బాధ్యతను తీసుకున్నందుకు ఆర్టీసీ తన వంతు చార్జీలు తీసుకుంటుంది. దీనివల్ల రైల్వేకు సరుకు రవాణా పార్శిళ్ల సంఖ్య పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీకి కూడా భారీ డిమాండ్‌ వస్తుందని  అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top