సాంకేతికత.. సంస్కరణలు

TSPSC Inspired To All States Says Ghanta Chakrapani - Sakshi

టీఎస్‌పీఎస్సీ ఆరేళ్ల జర్నీ.. ఇతర రాష్ట్రాల కమిషన్లకు ఆదర్శం

టీఎస్‌పీఎస్సీని అగ్రగామిగా నిలిపిన చైర్మన్‌ ఘంటా చక్రపాణి

ఈ నెల 17తో ముగియనున్న ఆయన పదవీకాలం

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సాంకేతికంగా పలు సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడిం చింది. కమిషన్‌కు తొలి చైర్మన్‌గా నియుక్తులైన ఘంటా చక్రపాణి ఆరేళ్లలో పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు నియామక పత్రాల జారీ వరకు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పారదర్శకతకు కేరాఫ్‌ అడ్రస్‌గా టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దారు. ఈనెల 17న ఘంటా చక్రపాణి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీ సాధించిన రికార్డులను పరిశీలిస్తే...

అంతా ఆన్‌లైన్‌..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడంలో టీఎస్‌పీఎస్సీ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లకు ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగ ప్రకటనలు మొదలు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఫీజు వసూలు, హాల్‌టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన.. చివరకు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రాన్ని కూడా ఆన్‌లైన్‌లో ఇచ్చి టీఎస్‌పీఎస్సీ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యేక చర్యల కారణంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌లతో ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణికి దక్కింది. టీఎస్‌పీఎస్సీ ప్రవేశపెట్టిన పలురకాల సంస్కరణలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావడంలో ఆయన కీలక భూమిక పోషించారు.

మారిషస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అండ్‌ డిసిప్‌లైన్డ్‌ ఫోర్సెస్‌ సర్వీస్‌ కమిషన్‌ బృందాలు టీఎస్‌పీఎస్సీని సందర్శించి ఇక్కడి విధానాలను ప్రత్యక్షంగా వీక్షించి పలు అంశాలను తమ దేశంలో అమలుకు ఉపక్రమించడం ద్వారా టీఎస్‌పీఎస్సీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. సీసీటీవీలు, డ్రోన్‌ కెమెరాలను కూడా వినియోగించి పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణను సులభతరంగా చేసింది. కమిషన్‌ తన కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్‌ చేయడంతో దేశంలోనే అత్యుత్తమ డిజిటల్‌ పీఎస్సీగా ఎంపికైంది. కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ)ని అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసింది. పారదర్శకతకు కూడా కమిషన్‌ పెద్ద పీట వేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యక్రమాలను ఏటా గవర్నర్‌కు నివేదిక రూపంలో అందజేయడం అనవాయితీగా పాటిస్తున్నారు. 

అవినీతి లేని వ్యవస్థను నిర్మించాం.. 
‘అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని పారదర్శక వ్యవస్థను నిర్మించగలిగాం. ఇది దేశంలో పీఎస్సీలకు, మారిషస్‌ లాంటి దేశాలకు మోడల్‌గా నిలిచింది. వారు మన పద్ధతులను అనుసరించడం గర్వకారణం’అని కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top