అన్ని భవిష్యత్తులోనే చేస్తారా: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

TS High Court Serious on Government Over Report On Covid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  కోవిడ్‌ విషయంలో తమ ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా అని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ట ధరలు సవరిస్తూ కొత్త జీవో ఇచ్చారా అని, 14 కొత్త ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని నిలదీసింది. రెండోదశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. మహారాష్ట్రలోని ఒకే జిల్లాలో 8 వేలమంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తుచేసిన హైకోర్టు.. థర్డ్‌ వేవ్‌కు ఏ విధంగా సన్నద్ధమయ్యారని అడిగింది. అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా అని ప్రశ్నించింది. నీలోఫర్‌ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా?. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారని, లైసెన్స్‌ రద్దుచేసిన ఆస్పత్రులకు బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారా అని నిలదీసింది. బంగారం తాకట్టుపెట్టి బాధితులు ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది. అయితే డీహెచ్‌ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరుకాలేదని  ఏజీ బీఎస్‌ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. రేపు హెల్త్‌ సెక్రటరీ, డీహెచ్‌, డీజీపీలో హైకోర్టులో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ రేపటికి వాయిదా వేసింది.

చదవండి: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నాం: డీహెచ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top