గురుకులాల్లో మరో 1,000 కొలువులు!

TS Gurukulam Recruitment 2022: Notification Jobs Vacancy - Sakshi

ఖాళీల వివరాలను ప్రభుత్వానికి నివేదించిన గురుకుల సొసైటీలు 

బోధనేతర ఉద్యోగాల భర్తీకి త్వరలో సర్కారు అనుమతులు! 

అన్నీ జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు చెందిన పోస్టులే 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరో వెయ్యి కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ బోధన విభాగానికి సంబంధించినవే. తాజాగా మరో వెయ్యి బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది.

ఇందుకు సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను సంబంధిత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా గుర్తించిన ఖాళీలన్నీ జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు చెందినవే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10 వేల ఉద్యోగాలను మూడేళ్ల క్రితం భర్తీ చేయగా..ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించింది. 

అత్యధికంగా బీసీ గురుకులంలో.. 
ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిం చనున్న వెయ్యి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కేవలం బీసీ గురుకుల సొసైటీలోనే భర్తీ కానున్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో భర్తీ కానున్నట్లు సమాచారం.

ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్‌పీఎస్సీకే ప్రభు త్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులు కూడా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. 

వారాంతంలో ట్రిబ్‌ సమావేశం 
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు  ఈ వారాంతంలో సమావేశం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన 9,096 ఉద్యోగాలకు గురుకుల సొసైటీల ద్వారా ఇండెంట్లు గురుకుల బోర్డుకు చేరుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అన్ని సొసైటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత సమావేశమై పోస్టుల భర్తీకి రిజర్వేషన్లు, రోస్టర్, జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల వివరాలను సరిచూసుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top