‘భారత్‌ బంద్‌’లో మంత్రులు

TRS Support To Bharat Bandh - Sakshi

బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు 

నేడు రైతులతో కలసి బూర్గులలో మంత్రి కేటీఆర్‌ ధర్నా

తూప్రాన్‌ వై జంక్షన్‌ వద్ద మంత్రి హరీశ్‌ రహదారి దిగ్బంధనం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌ బంద్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్‌ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గం తూప్రాన్‌ వై జంక్షన్‌ వద్ద నాగ్‌పూర్‌ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొంటారు.

జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు..
వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న భారత్‌ బంద్‌కు సంఘీభావంగా పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు మంగళవారం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూరు, ఎర్రబెల్లి దయాకర్‌రావు మడికొండ, సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

బంద్‌కు బందోబస్తు..
కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బంద్‌ నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పలు రైతు అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు కూడా బంద్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఆయన పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుకోవాలని సూచించారు.  బంద్‌ అనుకూల, వ్యతిరేక నేతలపై ఇంటెలిజెన్స్‌ పోలీసుల నిఘా కొనసాగుతోంది. వీలును బట్టి  హౌస్‌ అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top