‘చొప్పదండి మనవడిని.. కరీంనగర్‌ విద్యార్థిని’

Trs Minister Ktr Comments On Meeting In Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తాను చొప్పదండి మనవడిని.. కరీంనగర్‌ విద్యార్థిని అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్, చొప్పదండిలలో గురువారం దాదాపు రూ.1,100 కోట్లకుపైగా పనులకు వేర్వేరుగా భూమి పూజ చేసే కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తొలుత మధ్యాహ్నం రాంనగర్‌ మార్క్‌ఫెడ్‌ మైదానంలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. బీజేపీపై పదునైన విమర్శలు సంధించారు.

కరీంనగర్‌తో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. తాను చొప్పదండి మవనడిని అని, కరీంనగర్‌ విద్యార్థిని అని గుర్తుచేసుకున్నారు. తాను కరీంనగర్‌లోని మిషన్‌ ఆసుపత్రిలో జన్మించానని, ఎల్‌ఎండీ సమీపంలోని సరస్వతీ శిశుమందిర్‌లో, సెయింట్‌జోసెఫ్‌ స్కూళ్లలో చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. తాను ఇక్కడి తీరందాజ్, వెంకటేశ్వర థియేటర్లలో ఎన్నో సినిమాలు చూశానని.. ఏనాడూ బడి ఎగ్గొట్టలేదని చమత్కరించారు. కరీంనగర్‌ అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇక్కడ నిర్మించతలపెట్టిన మానేరు రివర్‌ఫ్రంట్, దాదాపుగా పూర్తికావొచ్చిన తీగల వంతెనలు కరీంనగర్‌ పట్టణ ఖ్యాతిని మరింత పెంచుతాయన్నారు. (చదవండి: ‘అవ్వా’ వెనకున్న అదృశ్యశక్తులెవరు?

ఇటీవల మంజూరైన మెడికల్‌ కాలేజీ, వెంకటేశ్వర స్వామి ఆలయాలతో నగరం మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. కరీంనగర్‌కు భీముడులాంటి మంత్రి గంగుల కమలాకర్‌ ఉన్నాడని ప్రశంసించారు. ఈ ఏడాది బతుకమ్మను అక్కా చెల్లెళ్లంతా మానేరు రివర్‌ ఫ్రంట్‌ తీరానే ఆడాలని, అక్కడే వాకింగ్, సైక్లింగ్‌ కూడా చేసుకునేలా సదుపాయాలు వస్తాయని చెప్పారు. పద్మనగర్‌లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూములను 660 మంది లబ్ధిదారులకు ఉగాదికి పంపిణీ చేస్తామన్నారు. మెడికల్‌ కాలేజీ పూర్తయితే విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టంచేశారు.

కరీంనగర్‌లో అద్దంలాంటి రోడ్లు.. 
మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు ముందు కరీంనగర్‌లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేదని, కేసీఆర్‌ సీఎం అయ్యాక పరిస్థితి మారిపోయిందన్నారు. ఈరోజు కరీంనగర్‌లో ఎక్కడ చూసినా అద్దంలాంటి రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడిగిన వెంటనే ఏనాడూ వెనకాడలేదని గుర్తుచేశారు. అంతేకాకుండా వెంకటేశ్వరాలయానికి పది ఎకరాల స్థలం అడిగిన వెంటనే ఇచ్చారని వెల్లడించారు. ఒకేరోజు జిల్లాలో రూ.1,100 కోట్ల పనులకు ఆమోదం తెలపడమే సీఎంకు కరీంనగర్‌పై అభిమానానికి నిదర్శమన్నారు.

ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి
►ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఏడేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇందుకు నీతి ఆయోగ్‌ ప్రశంసలే కొలమానమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీలు దుర్మార్గమైన ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. 
►అంతకుముందు మాట్లాడిన మేయర్‌ సునీల్‌రావు కార్పొరేషన్‌ పరిధిలో ప్రజల మౌలిక సదుపాయాలకు రూ.615 కోట్ల పనులకు అడిగిన వెంటనే ఆమోదం తెలిపినందుకు మంత్రులు కేటీఆర్, గంగులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీశ్‌బాబు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్‌ కర్ణన్, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిలోగా డిజిటల్‌ డోర్‌ నంబర్లు
కరీంనగర్‌సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మున్సిపాలిటీలో వచ్చే ఏడాది మార్చిలోగా డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌ పూర్తి కావాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ముందుగా కరీంనగర్‌లోని ఐటీ టవర్‌ పక్కన రూ.5 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. అనంతరం కరీంనగర్‌లోని ఐటీ టవర్‌లో కరీంనగర్, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్‌ అధికారులు, మేయర్లు, చైర్మన్లు, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌ నగరపాలక సంస్థకు రెండు బస్తీ దవాఖానాలు మంజూరు చేశారని తెలిపారు.

వీటికి సంబందించిన ఉత్తర్వులు ఇప్పుడే వచ్చాయని పేర్కొన్నారు. కరీంనగర్‌లో త్వరలోనే 5 వేల నల్లా కనెక్షన్లకు 24 గంటల పాటు నీరందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మున్సిపల్‌ బడ్జెట్‌ నుంచి 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆధునిక దోబీఘాట్‌ నిర్మించాలన్నారు. టీఎస్‌ బీపాస్‌ అనుమతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్నులు ఎగవేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు శంకుస్థాపన
►చొప్పదండిలో రూ.33 కోట్లతో మూడున్నర కిలోమీటర్ల మేర నిర్మించనున్న సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. 
►చొప్పదండిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో రూ.రెండు కోట్లతో నిర్మించే సమీకృత కూరగాయల మార్కెట్, వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. 
►రూ.20 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం ప్రారంభించారు. చొప్పదండి బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన స భలో మాట్లాడారు. తాను చొప్పదండి మనవడినని.. పక్కనే కొదురపాక తమ అమ్మమ్మ వాళ్ల ఊరని.. మిడ్‌ మానేరు కింద ఆ ఊరు మునిగిపోయిందని వెల్లడించారు. అనంతరం గంగాధరను మున్సిపాలిటీ చేయాలని ఎమ్మె ల్యే కోరారు. దీనికి స్పందిస్తూ.. మున్సిపాలిటీ చేస్తే కొన్ని నష్టాలు కూడా ఉంటాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం పోతుందని.. నిజంగా మున్సిపాలిటీ కావాలంటే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top