12న ‘సంగమేశ్వర’ సర్వేకు శ్రీకారం

TRS Govt has decided to start survey work on Sangameshwara Lift Irrigation project on June 12th - Sakshi

పనులు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్‌ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నియోజకవర్గాలలో సుమారు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు సర్వేపనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో హరీశ్‌రావు సర్వేపనుల నిర్వహణపై సమీక్ష జరిపారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు ద్వారా 57 వేల ఎకరాలకు, ఆందోల్‌ నియోజకవర్గంలో 56 వేల ఎకరాలు, జహీరాబాద్‌ నియోజకవర్గంలో సుమారు లక్షా ఆరు వేల ఎకరాలకు సాగు నీరందనుందని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రాజెక్టులో రెండు పంప్‌హౌస్‌లను నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి పంపు ద్వారా ఐదులాపూర్‌ నుండి వెంకటాపూర్‌ డెలివరీ సిస్టం వరకు సుమారు 125 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోయనున్నట్లు చెప్పారు. ఈ డెలివరీ సిస్టం నుండి జహీరాబాద్, హద్నూర్, కంది కెనాల్స్‌ ద్వారా దాదాపు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని పేర్కొన్నారు. రెండో లిఫ్ట్‌ ద్వారా జహీరాబాద్‌ కెనాల్‌పై హతికుర్దు నుంచి గోవిందాపూర్‌ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 42 వేల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. ఈ రెండో లిఫ్ట్‌ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్‌ మండలాలకు నీరు అందుతుందని చెప్పారు.

వేగంగా సర్వే పనులు ప్రారంభించాలని మంత్రి సాగునీటి శాఖ అధికారులకు, కన్సల్టెంట్‌ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. సమీక్షలో ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి సీఈ వి.అజయ్‌ కుమార్, ఎస్‌ఈ మురళీధర్, జహీరాబాద్‌ ఈఈ సుబ్రమణ్య ప్రసాద్, సంగారెడ్డి ఈఈ పి.మధుసూదన్‌రెడ్డి, కన్సల్టెంట్‌ ఏజెన్సీ ప్రతినిధి బి.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top