బీఆర్‌ఎస్‌ స్కైవేల కల నెరవేరింది | Transfer of Defence land due to BRS efforts: KTR | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ స్కైవేల కల నెరవేరింది

Mar 3 2024 4:46 AM | Updated on Mar 3 2024 7:03 PM

Transfer of Defence land due to BRS efforts: KTR - Sakshi

కేంద్రం అనుమతిపై కేటీఆర్‌ హర్షం

ప్రభుత్వం వెంటనే వీటి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి

తాము జరిపిన నిరంతర సంప్రదింపులు ఫలితాన్నిచ్చాయని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రక్షణ శాఖ ఎలివేటెడ్‌ స్కైవేల నిర్మాణానికి పచ్చజెండా ఊపడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కల నెరవేరిందని, దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే వీటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటి వల్ల హైదరాబాద్‌ నలుదిశలా విస్తరించేందుకు, ప్రగతిపథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు.

వీటి కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని కోరుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత పదేళ్ల కాలంగా అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. గత జూలై 31వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌–కరీంనగర్, హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ జాతీయ రహదారులకు సంబంధించిన ఎలివేటెడ్‌ స్కైవేల నిర్మాణంతో ఇంతకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వాస్తవానికి గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వివరించారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో అనేక ప్రణాళికలు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక కీలక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని కేటీఆర్‌ తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పాటు తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అంద జేశామని గుర్తు చేశారు. ప్రతిసారీ వారు సాను కూలంగా స్పందించారని తెలిపారు.

కేంద్ర ప్రభు త్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులు, యంత్రాంగానికి కేటీఆర్‌ ధన్యవాదా లు తెలిపారు. ఇది ఏ ఒక్కరితోనో సాధ్యం కాలేదని, సమష్టి విజయమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌తో పాటు ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో అనేక ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేయగలిగామని గుర్తుచేశారు. జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ రూట్లలో రెండు ఫ్లైఓవర్లకు కేంద్రం నుంచి  గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement