రాంగ్‌ రైడింగ్‌!

Traffic Rules Breaking And Number Plates Tampering in Hyderabad - Sakshi

సరైన నంబర్‌ ప్లేట్‌ లేకుండానే వాహనదారుల పరుగులు 

సైబరాబాద్‌లో యథేచ్ఛగా ట్రాఫిక్‌ ఉల్లంఘనులు 

ఈ ఏడాది ఇప్పటికే 38,896 కేసుల నమోదు..  

సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారుప్రాంతాల్లో వాహనాలకు సరైన నంబర్‌ ప్లేట్‌ లేకుండా చక్కర్లు కొడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలనియంత్రణతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఈ–చలాన్ల మోత నుంచి తప్పించుకునేందుకు ప్లేట్‌ నంబరింగ్‌ సరైనది లేకుండానే రోడ్లపై సవారీ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ జంక్షన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలకు ట్రిపుల్‌ రైడింగ్, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, సైడ్‌ మిర్రర్‌లు లేకుండా వాహనం నడపడం... ఇలా వివిధ ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు ఈ–చలాన్‌ జారీ చేద్దామని చూస్తున్న పోలీసులకే మస్కా కొడుతున్నారు.

దీంతో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వాహనదారుల ఉల్లంఘనుల భరతం పడుతున్నారు. ఇలా నేరుగానే ప్లేట్‌ నంబర్‌ సరిగాలేని వాహనాలను పట్టుకొని వారిని పోలీసులు అడుగుతుండడంతో ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నామని ఒప్పుకుంటున్నారు. మరికొందరేమో నేరాలు చేస్తున్న వారు కూడా సరైన నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలను వాడుతున్నట్టుగా గుర్తించారు. అయితే చాలా మంది ట్రాఫిక్‌ ఉల్లంఘనులు సీసీటీవీ కెమెరాలకు చిక్కుతున్నా సరైన నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో చలాన్లు జారీ చేయనివి లక్షల్లోనే ఉన్నాయని తెలిసింది.  

గతేడాదితో పొలిస్తే పది వేలు ఎక్కువే... 
గతేడాది జనవరి నుంచి జూలై వరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వివిధ ప్రాంతాల్లో చేసిన ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా 28,508 సరైన నంబర్‌ ప్లేట్‌ లేని వాహనదారులపై జరిమానా విధించారు. ఈ ఏడాది అదే ఏడు నెలల్లో ఏకంగా 38,896 వాహన ఉల్లంఘనుల భరతం పట్టారు. నాలుగు నంబర్‌లు ఉండాల్సిన వాహనానికి మూడు ఉండడం, ఒకవేళ నంబర్‌లు సరిగా ఉన్న నంబర్‌ ప్లేట్‌ను వంచడం, కొన్ని అంకెలను మార్చి నంబర్‌ ప్లేట్‌ ఉపయోగించడం తదితరాలు గుర్తించారు. వెంటనే సదరు వాహనాల పూర్తి వివరాలు సేకరించి సరైన నంబర్‌ ప్లేట్‌ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. వీరు మళ్లీ అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top