
రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్
రంగనాయక సాగర్ కట్టపై వేలమంది పరుగు
సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, సాక్షి మీడియా నిర్వహణ
ఉత్సాహభరితంగా సాక్షి డాట్ గేమ్స్.. విజేతలకు బహుమతులు
చిన్నకోడూరు (సిద్దిపేట): ఉరిమే ఉత్సాహం.. నువ్వా నేనా అన్నట్లుగా పరుగు.. చిన్నా పెద్ద తేడా లేకుండా వందల మది పోటీ. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాక్షి మీడియా సపోర్టింగ్ స్పాన్సర్‌గా ఆదివారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై నిర్వహించిన హాఫ్ మారథాన్ దృశ్యాలివి. 5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పో టీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఆసక్తిగా పాల్గొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. విజేతలకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ పోటీల్లో మూడు వేలమందికి పైగా పాల్గొన్నారు.
గేమ్స్.. సాక్షి సెల్ఫీ పాయింట్
రంగనాయక సాగర్‌కు వచ్చిన రన్నర్స్ అక్కడ సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాక్షి డాట్ గేమ్స్‌లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. డాట్ గేమ్‌లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన సాక్షి సెల్ఫీ పాయింట్‌లో ఫొటో దిగడానికి రన్నర్స్ ఆసక్తి చూపారు. సాక్షి మీడియా బృందంతో పాటు ఎంపీ రఘునందన్‌రావు, సినీ నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొని సెల్ఫీ పాయింట్‌లో సెల్ఫీ దిగారు.
హాఫ్ మారథాన్ విజేతలు వీరే..
హాఫ్ మారథాన్‌లో మహిళలు, పురుషుల విభాగాల్లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. 21 కే పురుషుల విభాగంలో మొదటి స్థానంలో దివ్యాన్‡్ష తోమర్, రెండో స్థానంలో రమావత్ రమేశ్ చంద్ర, మూడో స్థానంలో మంచికంటి లింగన్న నిలిచారు. మహిళల విభాగంలో మొదటి స్థానంలో ఎం ఉమ, రెండో స్థానంలో సునిమా దిలా, మూడో స్థానంలో జయశ్రీ వర్మ నిలిచారు.
10 కేలో పురుషుల విభాగంలో హరీశ్, సురేందర్, విజయ్ వరుసగా మొదటి, రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు. మహిళల విభాగంలో స్వప్న, సమ్రీన్, ముషారఫ్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 5 కేలో మహిళల విభాగంలో అభినయశ్రీ, మధు ప్రియ, అఫ్రీన్, పురుషులు గగన్ కుమార్, టిక్లూ, శివరాజు మొదటి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారు.
సాక్షి డాట్ గేమ్ విజేతలు..
సాక్షి డాట్ గేమ్‌లో ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కంకటి అశ్విత్‌గౌడ్ (చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామం), రెండో బహుమతి సుల్తానా (సుభాష్‌నగర్, సిరిసిల్ల), మూడో బహుమతి సురేందర్ (వెల్లటూరు గ్రామం, సిద్దిపేట అర్బన్ మండలం)లు గెలుచుకున్నారు. వీరిని సాక్షి మీడియా బృందం అభినందించింది.
నేషనల్ చాంపియన్ కావటమే లక్ష్యం..
సిద్దిపేటలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో మూడు సార్లు పాల్గొని విజేతగా నిలిచాను. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతూ అథ్లెటిక్స్‌లో కూడా పాల్గొంటు న్నాను. నేషనల్ చాంపియన్‌గా నిలవటమే నా లక్ష్యం. – ఉమ, నూతనకల్, సూర్యాపేట జిల్లా
మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను..
నేను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి వచ్చి హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నా. ఇక్కడికి రావడం మొదటి సారి. ఇతర రాష్ట్రాలలో చాలా సార్లు మారథాన్‌లో పాల్గొని విజేతగా నిలిచా. ఇక్కడ మొదటి సారిగా పాల్గొని 21 కేలో విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – దివ్యాన్షు తోమర్