
అగ్నిప్రమాదాల బారినపడే అవకాశం ఆ ఫ్యామిలీలకు అత్యధికం
వెరీ హై రిస్క్ జోన్‌లో 35,హై రిస్క్‌లో 38 ప్రాంతాలు
హైదరాబాద్‌లోని పరిస్థితులపై ముగ్గురు ప్రొఫెసర్ల సర్వేలో వెల్లడి
ఏషియన్ జర్నల్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీసెర్చ్‌లో ప్రచురితం
సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్ వద్ద ఓ ఇంట్లో ఈ ఏడాది మే 18న చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 17 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ దుర్ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకోగా... మంటలు విస్తరించడానికి ఆ ఇంటి ఆవరణలో జరుగుతున్న వాణిజ్య వ్యవహారాలే కారణమయ్యాయి. ఈ ఒక్క కుటుంబమే కాదు.. హైదరాబాద్‌లోని 2.6 లక్షల కుటుంబాలు, అందులోని 13 లక్షల మంది కుటుంబీకులు అగ్నిప్రమాదాల కోణంలో వెరీ హైరిస్క్ జోన్‌లో ఉన్నట్లు ముగ్గురు ప్రొఫెసర్లు చేపట్టిన అధ్యయనం స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ, నిజాం కాలేజీ, భోపాల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియోగ్రఫీ ప్రొఫెసర్లు వీణ రాపర్తి, కె.వెంకటేశ్, దుర్గేశ్ కుర్మి ‘హాట్ స్పాట్ అనాలసిస్ ఆఫ్ స్ట్రక్చర్ ఫైర్స్ ఇన్ అర్బన్ అగ్లోమరేషన్: ఎ కేస్ స్టడీ ఆఫ్ హైదరాబాద్ సిటీ’పేరుతో సాగిన ఈ అధ్యయనం ఇటీవల ఏషియన్ జర్నల్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది.
సెంట్రల్ జోన్‌లోనే 64.86 శాతం...
భాగ్యనగరంలో నానాటికీ జనసాంద్రత పెరిగిపోవడంతోపాటు నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు కలిసిపోవడం కూడా అగ్నిప్రమాదాల ముప్పు పెరగడానికి ప్రధాన కారణమని ఈ అధ్యయనం తేల్చింది. ఒకప్పుడు హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నివాస, వాణిస్య ప్రాంతాలంటూ విడివిడిగా ఉండేవి.
అయితే మారుతున్న పరిస్థితులతోపాటు భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో నివాస ప్రాంతాల్లోనే వాణిజ్య లావాదేవీలు చేసే సంస్థలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రాంతాలే అగ్నిప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్న ఏరియాలుగా మారిపోతున్నాయి. అన్ని జోన్ల కంటే సెంట్రల్ జోన్‌లోని 64.86 శాతం ప్రాంతాలకు అగ్నిప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఈ అధ్యయనం తేల్చింది.
ఈ ప్రాంతాలు వెరీ హైరిస్క్ పరిధిలో...
నిపుణుల అధ్యయనం ఆధారంగా చూస్తే హైదరాబాద్‌లోని 35 డివిజన్లు వెరీ హైరిస్క్ జోన్‌లో ఉన్నాయి. 131 చదరపు కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాల్లో 13.14 లక్షల మంది నివసిస్తున్నారని... ఈ లెక్కన వారు ప్రతి చదరపు కి.మీ.కి 17,669 మంది ఉంటున్నట్లని సర్వే లెక్కకట్టింది. ఈ ప్రాంతంలో ఉన్న 2,63,197 కుటుంబాలకూ ఈ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది.
2017–24 మధ్య చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న అధ్యయన బృందం ఈ విషయాన్ని ఖరారు చేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, వైరింగ్, ఉపకరణాల్లో ఉన్న లోపాలే అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తేల్చిన అధ్యయనం.. ఆయా అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాన్ని నొక్కిచెప్పింది. ఒక ఏడాది కాలంలో చోటుచేసుకొనే అగ్నిప్రమాదాల్లో 12–12.5 శాతం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
ఫైర్ స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలి...
ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైరింజన్లు ఎంత త్వరగా ఘటనాస్థలికి రాగలిగితే నష్టం అంత తగ్గించే అవకాశం ఉంటుందన్నది తెలిసిందే. 2017–2024 మధ్య చోటుచేసుకున్న ఉదంతాల ఆధారంగా చూస్తే నగరవ్యాప్తంగా చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల్లో అత్యధికం (95.19 శాతం) అరగంటలోనే మంటలు అదుపులోకి వచ్చాయి.
0.09 శాతం ఉదంతాలు గంటలో, 0.48 శాతం ఉదంతాలు రెండు గంటల్లో, 0.23 శాతం ఉదంతాలు నాలుగు గంటల్లో అదుపులోకి రాగా.. 4.02 శాతం ఉదంతాల్లో మాత్రం అగ్నిమాపక శకటాలు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు శ్రమించాల్సి వచ్చింది. గచ్చిబౌలి, చందానగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి మినహా మిగిలిన ప్రాంతాల్లోని ఫైర్ స్టేషన్లను ప్రాంతాలను బట్టి పునర్వ్యవస్థీకరించాలని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
వెరీ హైరిస్క్‌లో ఉన్న కీలక ప్రాంతాలు
వెంకటేశ్వర కాలనీ, గాం«దీనగర్, రెడ్‌హిల్స్, హిమాయత్‌నగర్, భోలక్‌పూర్, ముషీరాబాద్, బౌద్ధనగర్, అడిక్‌మెట్, రామ్‌నగర్, కవాడిగూడ, బంజారాహిల్స్, ఖైరతాబాద్, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్, బాలానగర్, సోమాజీగూడ, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఫతేనగర్, వెంగళ్‌రావునగర్, బర్కత్‌పుర, నాంపల్లి, మెహదీపట్నం, మల్లేపల్లి, నానల్‌నగర్, విజయ్‌నగర్ కాలనీ, కంటోన్మెంట్.