వెయ్యి విద్యుత్ బస్సులున్న సంస్థగా టీజీఎస్‌ఆర్టీసీ ఘనత
ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ల సరసన నిలిచిన తెలంగాణ
1,040కి చేరుకున్న బస్సుల సంఖ్య.. వచ్చే ఏడాదిలో 3,500కు చేరే చాన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ అరుదైన మైలురాయిని అధిగమించింది. వెయ్యికిపైగా విద్యుత్ బస్సులున్న సంస్థగా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు దేశంలో ఢిల్లీ 4,286 విద్యుత్ బస్సులు, మహారాష్ట్ర 4,001, కర్ణాటక 1,989, గుజరాత్ 1,041 తర్వాత వెయ్యికిపైగా విద్యుత్ బస్సులున్న ఐదో రాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 1,040 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. ఇటీవలే 60 విద్యుత్ బస్సులు రోడ్డెక్కడంతో ఈ ఘనత సాధించింది.
దశలవారీగా సమకూరిన ఈ–బస్సులు
దేశంలో విద్యుత్ బస్సుల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్–1 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద తొలిసారి హైదరాబాద్‌కు 40 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. ఒక్కో బస్సుపై రూ. కోటి వరకు సబ్సిడీ ఇచ్చింది. టెండర్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ సంస్థ ఈ ఏసీ బస్సులను నడుపుతోంది. ప్రస్తుతం అవి పుష్పక్ పేరుతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చారు. కిలోమీటర్‌కు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ ఆ సంస్థకు అద్దె చెల్లిస్తుంది.
అలాగే ఫేమ్–2 పథకం కింద మరో కంపెనీ టెండర్ దక్కించుకున్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఆ బస్సులను సరఫరా చేయలేదు. ఆ తర్వాత జీసీసీ పద్ధతిలో ఆర్టీసీ టెండర్లు పిలిస్తే పుష్పక్ బస్సులు తిప్పుతున్న కంపెనీ దక్కించుకుంది. ఆ టెండర్ కింద 500 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉండగా దశలవారీగా 440 సరఫరా చేసింది. చివరి విడత 60 బస్సులు ఇటీవలే అందజేసింది.
ఇక హైదరాబాద్ వెలుపల కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ఉద్దేశంతో నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్‌ఈబీపీ) పథకం కింద ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేసింది. దీనికింద ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ జీసీసీ పద్ధతిలో సరఫరా చేసేందుకు 500 బస్సుల కాంట్రాక్టు పొందింది. ఆ బస్సులన్నీ రోడ్డెక్కాయి.
త్వరలో 2,200 బస్సులు...
హైదరాబాద్‌లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే ఆర్టీసీ ద్వారా తిప్పాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు బస్సులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలని ఆర్టీసీ దరఖాస్తు చేసుకోగా కేంద్రం 2,200 బస్సులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి మూడు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని నెలల్లో ఈ బస్సుల రాక మొదలవుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం బస్సులు ఆర్టీసీకి అందనున్నాయి.
మరోవైపు డీజిల్ బస్సులను రెట్రోఫిట్‌మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే కార్యక్రమాన్ని కూడా ఆర్టీసీ ప్రారంభించింది. ఇటీవలే ఓ బస్సును ప్రయోగాత్మకంగా తయారు చేయగా అది సత్ఫలితాలనిచ్చిందని ఆర్టీసీ పేర్కొంటోంది. దీంతో 200 బస్సులను రెట్రోఫిట్‌మెంట్ చేసేందుకు టెండర్లు పిలవగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. వచ్చే ఏడాదిలో ఆ బస్సులు కూడా మొదలవుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య సుమారు 3,500కు చేరుతుంది.


