25 రోజుల్లో 81 మంది నేరగాళ్ల అరెస్టు
పలు కేసుల్లో కలిపి రూ.95 కోట్లు కొల్లగొట్టినట్టు గుర్తింపు
వివరాలు వెల్లడించిన టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) చేపట్టిన భారీ అంతర్రాష్ట్ర ఆపరేషన్ విజయవంతమైంది. మొత్తం ఐదు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ 25 రోజులపాటు ఆయా రాష్ట్రాల్లో టీజీ సీఎస్‌బీ చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్లలో ఏడుగురు మహిళలు సహా..మొత్తం 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలోని ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదైన 41 సైబర్ నేరాల్లో ప్రత్యక్షంగా సంబంధం ఉందని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా 754 సైబర్ కేసుల్లోనూ నిందితులకు సంబంధం ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో కలిపి మొత్తం రూ.95 కోట్లు నిందితులు కొల్లగొట్టినట్టు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌ల వివరాలను టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్‌కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాదీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 11 మంది సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన సొమ్మును చెక్కుల ద్వారా, ఏటీఎంల ద్వారా నగదు ఉప సంహరణలో పాల్గొన్నవారు, 53 మంది మ్యూల్ బ్యాంకు ఖాతా హోల్డర్లు ఉన్నారు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు (ఒకరి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను వేరొకరు వినియోగించుకునేందుకు ఇచ్చేవి) ఇచ్చినందుకు వీరికి సైబర్ నేరగాళ్ల ముఠాలు 5 శాతం కమీషన్ ఇస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించామన్నారు.
నిందితుల వృత్తుల వారీగా చూస్తే.. ఒక ఐడీఎఫ్‌సీ బ్యాంకు సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫెడరల్ బ్యాంకు ఉద్యోగి, బంధన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేషన్స్ డిప్లొమా హోల్డర్, చెన్నై కిల్‌పోక్ ఆడిట్ ఆఫీస్‌లో అకౌంటెంట్, బీబీఏ గ్రాడ్యుయేట్, ఒక ఎంఎన్‌సీ సహా ఇతరులు ఉన్నట్టు తెలిపారు. విదేశాల్లోని సైబర్ క్రైం నెట్‌వర్క్‌లతో కొందరికి సంబంధాలున్నట్టు గుర్తించామని, వారిపై లుక్‌ఔట్ సర్క్యులర్లు జారీ చేసినట్టు వెల్లడించారు.
ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో కీలకంగా పనిచేసిన అదనపుఎస్పీ బిక్షంరెడ్డి, డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, ఎస్‌వీ హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, వై వెంకటేశ్వరరావు, కే గిరికుమార్, వేణుగోపాలరెడ్డి, బి అశోక్, ఏ సుభాశ్ చంద్రబోస్, నందిరామ్ ఇతర సిబ్బందిని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ అభినందించారు.


