హెచ్‌ఎంలతోనే సమస్య 

Telangana Teachers Promotions And Transfers Only If Principals Agree - Sakshi

వాళ్లు ఒప్పుకుంటేనే పదోన్నతులు, బదిలీలు 

ఎన్నికలొస్తే మళ్లీ బ్రేక్‌ పడుతుందనే ఆందోళనలో టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒప్పుకుంటేనే బదిలీల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లొచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వారిని పరిగణనలోనికి తీసుకోని పక్షంలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే.

దీంతో పదోన్నతులైనా కల్పించాలని కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాశాఖ నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. ఇప్పటివరకూ అన్ని కేటగిరీల టీచర్లకు సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇవ్వాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే సీనియారిటీ జాబితాను రూపొందించారు. అయితే, హెచ్‌ఎంల విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వీరికి ఎంఈవోలుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది.

అదీగాక, ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షణ పోస్టుల విషయంలో ఉపాధ్యాయుల మధ్య వివాదం పరిష్కారం కాలేదు. నిబంధనల ప్రకారం పర్యవేక్షణ పోస్టులు తమకే ఇవ్వాలని ప్రభుత్వ హెచ్‌ఎంలు కోరుతున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని బడుల్లో ఉన్న హెచ్‌ఎంలకు పర్యవేక్షణ పోస్టులు ఇవ్వాల్సిందేనని మరికొంత మంది కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ జటిలంగానే మారింది.

ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తే స్కూల్‌ అసిస్టెంట్లు.. హెచ్‌ఎంలు అవుతారు. వారికి ఉన్న స్కూళ్లను కేటాయించి, ఇప్పుడున్న హెచ్‌ఎంలను ఎంఈవోలుగా ప్రమోట్‌ చేయకుండా, ఎక్కడికి పంపుతారనే ప్రశ్న తెరమీదకొచ్చింది. కాబట్టి ఈ విషయంలో అంగీకారం వస్తేనే బదిలీలు, పదోన్నతుల అంశం ముందుకెళ్తుందని అధికారులు అంటున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొన్ని సంఘాలు చెబుతున్నా, ముందస్తు ఎన్నికల భయం వారిని వెంటాడుతోంది.

సెలవుల్లో టెన్త్‌ పేపర్ల మూల్యాంకన విధులుంటాయి. ఆ తర్వాత ఎన్నికల గంట మోగితే బదిలీలు, ప్రమోషన్లు లేనట్టేనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. బదిలీలు, పదోన్నతులు రెండూ ఒకేసారి చేపట్టాలని, లేని పక్షంలో తమకు న్యాయం జరగదని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రాజాభాను చంద్రప్రకాశ్‌ చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top