మమ్మల్ని కలపండి సారూ

Telangana: Spouse Teachers Of Govt Schools Protest Seeking Allocation Same District - Sakshi

స్పౌజ్‌ బదిలీల కోసం పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన 

డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్ష.. 

నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ కుటుంబాలు 

513మంది ఉపాధ్యాయుల అరెస్టు 

ఆ సందర్భంలో పిల్లలు, మహిళల రోదనలతో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం 

సాక్షి, హైదరాబాద్, ఖైరతాబాద్‌: తమ పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన, దీక్ష,.. ప్రతిగా పోలీసుల అరెస్టులు.. తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో.. ఏం జరుగుతోందో తెలియక చిన్నారుల రోదనలు.. వెరసి శనివారం హైదరాబాద్‌లో స్పౌజ్‌ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దంపతులు నిర్వహించిన ధర్నాలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.

13 జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు తమ పిల్లలతో కలిసి వచ్చి బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా పాఠశాల డైరెక్టర్‌(డీఎస్సీ) కార్యాలయం ముందు మౌనదీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ దంపతుల్ని కలపండి... ముఖ్యమంత్రి మాటను నిలపండి’... ‘భార్యా భర్తలను, పిల్లలను విడదీయకండి’... ‘అమ్మ అటు ... నాన్న ఇటు.. మరి నేను ఎవరివైపు???’అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు.

భార్య ఒకచోట, భర్త ఒక చోట ఉద్యోగం చేసే పరిస్థితికి స్వస్తి చెప్పి, ఒకే దగ్గర కలిసి ఉండేలా స్పౌస్‌ బదిలీలు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్‌ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

2100 మంది బాధితులు... 615 మందికే స్పౌస్‌ బదిలీ! 
దంపతుల బదిలీలను బ్లాక్‌ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్‌ బదిలీలు జరుగుతున్నాయని నిరసన దీక్ష సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్‌ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోయారు. 

రసాభాసగా మౌనదీక్ష 
ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పరిస్థితి రసాభాసగా మారింది. తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో పిల్లలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియక విలపిస్తూ ఉండిపోయారు. దీంతో తల్లులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లుల, పిల్లల రోదనలతో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 513మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, బేగం బజార్, నారాయణగూడ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కాగా, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని నేతలు వివేక్, కాదర్, కృష్ణ, నరేష్, మమత, త్రివేణి, సుజాత స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులను తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సయ్యద్‌ షౌకత్‌ ఆలీ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా ... 
సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్‌ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్‌ బదిలీ కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో 252 ఎస్‌జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే... 28 మంది ఎస్జీటీలు మాత్రమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీ దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా, 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్‌ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్‌ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయుల వాదన. సీఎం కేసీఆర్‌ వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top