ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కథ కంచికేనా..? బాధితులకు డబ్బులు అందుతాయా!

Telangana: RFCL Job Scam Controversy: Will Victims Receive Their Money - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రామగుండం ఫెర్టిలైజర్స్‌ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న నలుగురు దళారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు డబ్బులు అందుతాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బాధితులతో రెండురోజులపాటు మాట్లాడి భరోసా కల్పించారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాల పేరుతో సుమారు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసిన దళారులు.. బాధితుల వద్ద ఎలాంటి పత్రాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నోటిమాట ఆధారంగానే బాధితులు రూ.లక్షలు దళారుల చేతిలో పోశారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కొందరు “మీకు ఉద్యోగం కల్పించాం.. డబ్బులిచ్చేది లేదు..’ అని బాధితులతో గొడవకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వారం క్రితం ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో దళారిపై పెట్రోల్‌ పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తాజాగా శుక్రవారం ముంజ హరీశ్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దళారులుగా ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
చదవండి: కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి?

దళారులు ఎంతమంది..?
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగ నియామకంలో ఎంతమంది దళారులు, మధ్యవర్తులు ఉన్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త కాంట్రాక్టర్‌ కార్మికులను తొలగించడంతో మోసపోయామని గ్రహించిన కార్మికులు ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్‌ హమాలి పేరుతో నగదు దండుకున్న కార్మిక సంఘం నాయకుడిపై ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదు. వీరితోపాటు మరికొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రచారం జపరుగుతోంది.

ఎవరు చెల్లిస్తారు..?
బాధితులకు ఇప్పుడు నగదు ఎవరు చెల్లిస్తారనే వ్యవహారంలో స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజులుగా కోరుకంటి చందర్‌ తన క్యాంపు కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో బాధితులకు నగదు చెల్లించేలా కృషి చేస్తారో లేదో.. వేచి చూడాల్సి ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top