కు.ని.ఆపరేషన్‌పై భయాందోళనలు.. వ్యాసెక్టమీతో పురుషులకు వచ్చే ఇబ్బందులేంటి?

Four Women Dies After Family Planning Surgery: What Is Vasectomy Tubectomy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. 35 గంటల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక రాష్ట్రంలో ఇంతటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. మరణాలకు కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రాథమిక అంచనాకు రాలేమని తెలిపారు. కు.ని ఆపరేషన్లు కేవలం ఆడవారికే పరిమితమతున్నాయని, దీనివల్ల మహిళలకు ఇబ్బంది ఆవుతోందని తెలిపారు. తెలంగాణలో జరిగే కు. ని ఆపరేషన్లలో మగవారి శాతం కేవలం మూడేనేనని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. 
చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్‌

ట్యూబెక్టమీ అంటే
మహిళలకు లాపరోస్కోపిక్‌ ట్యూబెక్టమీ అనే డే కేర్‌ ఆపరేషన్‌ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్‌ ట్యూబ్స్‌ను బ్లాక్‌ చేసేస్తారు. జనరల్‌ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్‌ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్‌ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి.

ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్‌ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్‌ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్‌ ఉంటాయి. వీటిని బ్యాండ్‌ ఎయిడ్‌తో కవర్‌ చేసుకోవాలి.

ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్‌ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్‌ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్‌ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్‌ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్‌ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్‌ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చు.

మహిళలకు రిస్క్‌..
అయితే, కుటుంబ నియంత్రణ కోసం మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ పురుషులకు చేసే వ్యాసెక్టమీ ఆపరేషన్‌తో పోల్చితే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కు.ని కోసం ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. మరోవైపు పురుషుల కంటే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది.  

పురుషులు దూరంగా..
వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్‌ ఆపరేషన్‌ లాంటిదని.. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు. పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
చదవండి: కుడి చేతిపై లవ్‌ సింబల్‌.. భార్య ప్రవర్తనతో భర్త షాక్‌.. చివరికి ఏం చేశాడంటే?

ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయినా కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా ఆపరేషన్లు విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top