
లక్ష్యానికి దూరంగా జీసీసీ కార్యకలాపాలు
అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లపై చిరుకన్ను
గిరిజనులకు దిక్కవుతున్న దళారులు
ఆదాయం కోల్పోతున్నాపట్టించుకోని వైనం
గాడిలో పెట్టేందుకు యత్నించని సర్కారు
రంపచోడవరం: గిరిజన సహకార సంస్థ లక్ష్యానికి దూరంగా పనిచేస్తోంది. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి వారికి బాసటగా ఉండాల్సిన సంస్థ అరకొరగా కొనుగోళ్లు చేస్తూ చేతులు దులుపుకుంటోంది. కొన్ని రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే మానేసింది.
అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా మార్కెట్‌లో రేటు లేదనే కారణాన్ని చూపుతూ కొనుగోలుకు దూరంగా ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులకు మంచి ఆదాయాన్నిచ్చే కొండచీపుళ్లు ధర పడిపోయిందన్న కారణంతో కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజనులు వారు సేకరించిన చీపుళ్లను మారేడుమిల్లి తీసుకువచ్చి కట్ట రూ.50 నుంచి రూ.60కు అమ్ముకుంటున్నారు.
వీటిని దళారులు రూ.70 నుంచి రూ.90కు అమ్ముకుని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. వీటికి సంబంధించి జీసీసీ నిర్ణయించిన ధరకు దళారులు చెల్లించే ధరకు ఎంతో వ్యత్యాసం ఉంది. మొదటి రకం ధర (గ్రేడ్–1) రూ. 45, గ్రేడ్ –2 రూ. 40, గ్రేడ్ –3 రూ. 35గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో గిరిజనులు గ్రేడ్‌లతో సంబంధం లేకుండా ఒక కట్ట రూ. 50 ధరకు పైగా అమ్ముకుంటున్నారు.
గతంలో కొనుగోలు చేసిన 20 వేల కొండ చీపుళ్లను కాకినాడ జిల్లా ఏలేశ్వరం గొడౌన్‌లో నిల్వ చేశారు. ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏటా బయట మార్కెట్‌లో కొండచీపుళ్లకు రేటు ఉన్న జీసీసీ నామ మాత్రపు ధరతో కొనుగోలు చేస్తోంది. దీంతో తమ ఉత్పత్తులను జీసీసీ చెల్లించే ధర కంటే బయట వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుంటున్నారు.
చింతపండు కిలో రూ.36 ధర నిర్ణయించగా బయట మార్కెట్లో వ్యాపారులకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకవాడ గండి చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. ఈరకాన్ని వ్యాపారులు రూ.180 నుంచి రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ మాత్రం ఈ రకాన్ని ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే చింతపండుకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తోంది. దీంతో జీసీసీకి విక్రయించేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు.
మారేడుమిల్లి ప్రాంత గిరిజనులకు శీకాయ మంచి ఆదాయ వనరు. దీనిని జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గతంలో విదేశాలకు ఆర్గానిక్ శీకాయను సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ తరువాత జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు.
జీసీసీ గిరిజనులు సేకరించే, పండించే సుమారు 34 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు అవి అంతరించిపోకుండా చూడాల్సి బాధ్యత కూడా ఆ సంస్థపై ఉంది. కోవెల జిగురు కోసం చెట్టు బెరడును సేకరిస్తారు. దీంతో కొంత కాలానికి ఆ చెట్టు చనిపోతుంది. కోవెల చెట్లు అంతరించిపోకుండా వీటి మొక్కలను గిరిజనులతో నాటించి సంతతిని అభివృద్ధి చేయాల్సి ఉంది. జీసీసీకి సేకరణపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనివల్ల చాలా వరకు కోవెల చెట్లు అంతరించిపోయాయి. నరమామిడి చెట్లది అదే పరిస్థితి.
ఆయుర్వేద విలువలు ఉన్న తిప్ప తీగ, కొవెల జిగురు తదితర వాటి కొనుగోళ్లను పూర్తిగా తగ్గించింది. గానుగ పిక్కలు, కరక్కకాయలు, ముసిడి గింజలు, నల్ల జీడిపిక్కలు,నేపాల గింజలు రెల్ల చెక్క, తానికాయలు వంటి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు.