బదిలీ అయినా కదలరు | Conflict among Genco employees over transfers | Sakshi
Sakshi News home page

బదిలీ అయినా కదలరు

May 2 2025 4:31 AM | Updated on May 2 2025 4:31 AM

Conflict among Genco employees over transfers

బదిలీలపై జెన్‌కో ఉద్యోగుల మధ్య సంఘర్షణ 

ఉత్తర్వులు వెలువడి 20 రోజులైనా రిలీవ్‌కాని సిబ్బంది 

15 మంది బదిలీ రద్దు చేస్తున్నట్లు కొత్తగా ఉత్తర్వులు 

రామగుండం: పుట్టింది.. పెరిగింది.. పెళ్లి చేసుకుని, పిల్లలను చదివించింది ఇక్కడే. స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు వారసత్వ ఉద్యోగాలు కూడా చేశారు. మరికొందరు కాంట్రాక్టు కార్మికులుగా, ఆర్టిజన్లుగా పనిచేశాక పర్మనెంట్‌ అయ్యా రు. ఒక్కొక్కరు సుమారు ఇరవై ఏళ్లపాటు రామగుండం బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోనే ఉద్యోగా లు చేశారు. ఈ ప్రాంతంతో బంధాలు పెనవేసుకున్నారు. 

అయితే, గతేడాది జూన్‌ 4న బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మూతపడింది. జూలైలో 48 మంది ఇంజనీర్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతలో ఏమైందో, ఏమో.. కొద్దిగంటల్లోనే ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి. అప్పటినుంచి సుమారు 10 నెలల పాటు వారికి రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. 

కాగా, గత ఏప్రిల్‌ 12న 85 మంది ఉద్యోగులను యాదాద్రికి బదిలీ చేస్తున్నట్లు విద్యుత్‌ సౌధ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. బదిలీ ఉత్తర్వుల జాబితాలో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ విజేందర్‌తోపాటు ఓఅండ్‌ఎం నుంచి 72 మంది, ఇంజనీర్లు 11 మంది, ఏడీఈ నుంచి ఒకరి పేర్లు వచ్చాయి. వీరు వారంలోగా రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

భిన్న వాదనలు.. 
యాదాద్రికి 85 మందిని బదిలీ చేయడంపై ఉద్యోగుల్లో విమర్శలు వినిపించాయి. ముందస్తు సమాచారం లేకుండా, సాంకేతిక అంశాలను పరి గణనలోకి తీసుకోకుండా హఠాత్తుగా బదిలీ చేయ డం, వారం లోగా రిలీవ్‌ కావాలని ఆదేశించడం సరి కాదని, అన్ని విభాగాలకు బదిలీలు వర్తింపజేయా ల్సి ఉందంటూ.. ఉత్తర్వులను పెండింగ్‌లో ఉంచారు. 

అయితే, కొంతజాప్యమైనా బదిలీ తప్పదని భావించిన నలుగురు ఇంజనీర్లు, 11 మంది ఓఅండ్‌ఎం ఉద్యోగులు.. తమ పలుకుబడి ఉపయోగించి బదిలీలను నిలుపుదల చేస్తూ గురువారం ఉత్త ర్వులు తెప్పించుకున్నారు. ఫలితంగా బదిలీ అయి న ఉద్యోగులు, బదిలీ నిలిచిపోయిన ఉద్యోగుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. 

అక్కడ కొరత.. ఇక్కడ మిగులు 
యాదాద్రి విద్యుత్‌ కేంద్రంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై జరిపిన విచారణలో ఉద్యోగుల కొరత అంశం బహిర్గతమైంది. సిబ్బంది కొరతతోనే పర్యవేక్షణ లోపించిందని, ఫలితంగా ప్రమాదం జరిగిందని తేలింది. రామగుండంలో మూతపడిన బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని 200 మంది ఇంజనీర్లను కూర్చోబెట్టి ప్రతినెలా రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారనే అంశంపై యాదాద్రిలోని ఉన్నతాధికారులు విద్యుత్‌ సౌధలో చర్చించారు. ఈ క్రమంలో గత నెల యాదాద్రికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడినా.. రిలీవ్‌ కాకపోవడంతోపాటు బదిలీలను రద్దు చేసుకునేందుకు ఎవరికి వారే పైరవీలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. 

ఆదేశాలు అమలు చేస్తున్నాం 
గత ఏప్రిల్‌లో నాతోపాటు 85 మందిని యాదాద్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఉత్తర్వుల్లోని ఇంజనీర్లలో నలుగురు, 11 మంది ఓఅండ్‌ఎం ఉద్యోగుల బదిలీలను నిలిపివేస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వారిని మినహాయించి మిగతా వారు త్వరగా రిలీవ్‌ కావాలంటూ ఉత్తర్వులు అందజేశాం. – పి.విజేందర్, సూపరింటెండింగ్‌ ఇంజనీర్, రామగుండం బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 

Advertisement
 
Advertisement
Advertisement