సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పరిణామాలతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాలు,త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో హస్తిన వేదికగా కీలక చర్చలు సాగుతున్నాయి.
ఈ క్రమంలో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు అధిష్టానం పెద్దలతో మంత్రి కొండా సురేఖ భేటీ కానున్నారు.
మరోవైపు, కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఆశావాహుల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సైతం కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వేదికగా ఏఐసీసీ ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. వీరితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా ఢిల్లీ చేరుకున్నారు.
మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశాలతో పాటు, రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, తుది స్థానాల భర్తీపై ఈ కీలక సమావేశాల్లో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


