సాక్షి, ఖమ్మం: తెలంగాణలో సంచలనం సృష్టించిన సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామారావు హత్య కేసులో ఆరుగురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టు చేస్తున్నారు. ఈ హత్య కేసులో పాలిగ్రాఫ్ టెస్టుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, పాలిగ్రాఫ్ టెస్ట్ నిమిత్తం కాంగ్రెస్ నాయకులు బొర్రా ప్రసాదరావు, కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావు, కంచుమర్తి రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, గుగ్గిళ్ళ రాధాకృష్ణ బెంగళూరుకు వెళ్లారు. ఇక, గతేడాది అక్టోబర్ 31న చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదటి నుంచి రామారావు హత్య కేసులో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులే రాజకీయ కక్షతో రామారావును అంతమొందించారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 రోజులు దాటినా.. కేసులో పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈనెల 5న శాసనసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో రామారావు హత్య కేసులో 24 మందికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఖమ్మంలో మూడో అదనపు ప్రధాన న్యాయమూర్తిని పోలీసులు కోరినట్లు తెలిసింది. వారిలో రామారావు కుటుంబీకులు సైతం ఉన్నట్లు సమాచారం. పాలిగ్రాఫ్ అనేది ఒక వ్యక్తి నిజం చెబుతున్నాడా..? అబద్ధమాడుతున్నారా..? అనే విషయాన్ని అంచనా వేయటానికి శాస్త్రీయంగా చేసే పద్ధతి. 24 మందికి న్యాయస్థానం నోటీసులు ఇవ్వగా ఆరుగురు మాత్రమే సమ్మతి తెలిపారు.


