Telangana: ‘సగం’ మండలికి ఎన్నికలు | Telangana mlc Elections For Almost Half Of The Seats | Sakshi
Sakshi News home page

Telangana: ‘సగం’ మండలికి ఎన్నికలు

Nov 10 2021 2:21 AM | Updated on Nov 10 2021 2:03 PM

Telangana mlc Elections For Almost Half Of The Seats - Sakshi

తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో దాదాపు సగం స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో దాదాపు సగం స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ఒక గవర్నర్‌ కోటా స్థానం, ఆరు ఎమ్మెల్యే కోటా సీట్లు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మరో 12 స్థానిక సంస్థల కోటా సీట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటికీ కూడా రెండు నెలల్లోపే కొత్తవారు ఎన్నిక కానుండటంతో ఉత్కంఠగా మారింది.

అటు అసెంబ్లీలో, ఇటు స్థానిక సంస్థల్లో సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు పూర్తిబలం ఉండటంతో ఎమ్మెల్సీ స్థానాలన్నీ టీఆర్‌ఎస్‌ కైవసం కావడం ఖాయమని రాజకీయవర్గాలు చెప్తున్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో గట్టి పోటీ మొదలైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిలో పడితే శాసనమండలిలో అడుగుపెట్టవచ్చన్న ఆశాభావం కనిపిస్తోంది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగినవారితోపాటు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.

ఖాళీ అయ్యే స్థానాలు ఏవి?
స్థానిక సంస్థల కోటాలోని 14 మంది ఎమ్మెల్సీలకుగాను 12 మంది పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. ఇందులో పురాణం సతీశ్‌ (ఆదిలాబాద్‌), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), వి.భూపాల్‌రెడ్డి (మెదక్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), టి.భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు (రంగారెడ్డి) ఉన్నారు. వీరిలో వెన్నవరం భూపాల్‌రెడ్డి మండలి ప్రొటెం చైర్మన్‌గా, భానుప్రసాద్‌రావు, దామోదర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌లుగా పనిచేస్తున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత కేవలం 13 నెలలపాటు ఎమ్మెల్సీగా కొనసాగి పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు.

ఇక భూపాల్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణరావు వంటివారు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. పదవీకాలం పూర్తవుతున్న ఈ 12 మంది ఎమ్మెల్సీల్లో ఎంత మందికి తిరిగి అవకాశం వస్తుందన్న దానిపై నేతలంతా ఉత్కంఠగా ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల్లో సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఓ వైపు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతూనే.. మరోవైపు ‘స్థానిక’ఓటర్లు చేజారకుండా చూసుకోవాలని ఆయా జిల్లాల మంత్రులను కేసీఆర్‌ అప్రమత్తం చేసినట్లు సమాచారం.

గవర్నర్‌ కోటాలో వేరే వారికి..
కొద్దినెలల కింద కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివర్గం నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర మంత్రివర్గ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి స్థానంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డినిగానీ, లేదా అదే సామాజికవర్గానికి చెందిన మరొకరిని గానీ నామినేట్‌ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఆచితూచి కసరత్తు!
పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పదవులు అందుబాటులో ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఆచితూచి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలు, సామాజికవర్గాలు, కులాల వారీగా సమీకరణాలను బట్టి చాన్స్‌ లభించే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలు, సామాజికవర్గాల నేతలు ఎవరికివారుగా తమకు అవకాశంపై లెక్కలు వేసుకుంటున్నారని పేర్కొంటున్నాయి.

డిసెంబర్‌ 10న ‘స్థానిక’ ఎమ్మెల్సీ పోలింగ్‌
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దాని ప్రకారం.. ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 24న నామినేషన్లను పరిశీలించి.. పోటీలో ఉండేవారి జాబితాలను ఖరారు చేస్తారు. వచ్చే నెల (డిసెంబర్‌) 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాగా.. ఏపీలోని 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలకూ సీఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలోని అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కో స్థానానికి.. కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల నుంచి రెండేసి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

ఏ కోటాలో ఎన్ని?
గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డిని కేబినెట్‌ నామినేట్‌ చేసినా గవర్నర్‌ ఆమోదించలేదు. ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. స్థానిక సంస్థల కోటాలోని 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం జనవరి 4న ముగి యనుంది. ఈ ఎన్నిక కోసం ఈసీ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఏకకాలంలో అభ్యర్థుల ప్రకటన?
ఎమ్మెల్యే కోటా సీట్లకు మంగళవారం నుంచి 16 వరకు.. ‘స్థానిక’ కోటా సీట్లకు 16 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండు కోటాలకు సంబంధించిన 18 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించేలా సీఎం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గవర్నర్‌ కోటాలోని నామినేటెడ్‌ సభ్యుడి పేరునూ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement