
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది.