హైదరాబాద్‌ వర్షాలపై కేటీఆర్‌ రెడ్‌ అలర్ట్‌

Telangana: Minister KTR Review On Heavy Rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో గురువారం మాట్లాడారు. ఉత్తర తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. నిర్మల్ వంటి చోట్ల భారీగా వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలపై స్థానిక జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే విపత్తు స్పందన దళం (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌-డీఆర్‌ఎఫ్‌) అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ప్రతి ఒక్క పురపాలక శాఖ అధికారి/ ఉద్యోగి విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top