
సాక్షి, హైదరాబాద్: లాభాలు, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో బీజేపీ చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి కొప్పుల మీడియాతో మాట్లాడారు. కొత్త బ్లాకులు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోగా.. ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సింగరేణి కార్మికులు పోరాడాలని కొప్పుల పిలుపునిచ్చారు. బాల్క సుమన్ మాట్లాడుతూ సింగరేణిని బొంద పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, సింగరేణిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని గండ్ర డిమాండ్ చేశారు.