
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణంపై కోర్టు ఆదేశాలున్నా ఎలా కూల్చివేశారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ, విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేసింది. రంగనాథ్‌తోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిలకు నోటీసులు జారీ చేసింది.
వివరాల ప్రకారం.. తన ఇంటి విషయంలో మున్సిపాలిటీ అధికారులు, హైడ్రా జోక్యం చేసుకొని కూల్చే ప్రయత్నం చేస్తున్నాంటూ వడ్దే తార హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద నిర్మాణం సున్నం చెరువు ట్యాంక్‌లో ఉందని హైడ్రా వాదనలు వినిపించింది. రెవెన్యూ అధికారుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నామని, అది పూర్తయిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తర్వాత చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఈ ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేశారు.
అయినా, కోర్టు ఆదేశాలను పక్కకు పెట్టి తన ఇంటిని కూల్చివేశారంటూ తార ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సున్నం చెరువుపై సర్వే పూర్తి చేసి హద్దులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించాలని, ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం చెప్పినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. జూన్ 30న పిటిషనర్‌ను అరెస్టు చేసి, ఇంటిని కూలిచేశారని చెప్పారు. కోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. మాదాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్‌ఐ వెంకటేశ్.. 70 మందితో జూన్ 30న ఉదయం 4 గంటలకు వచ్చి పిటిషనర్‌తోపాటు కుటుంబసభ్యులను ఇంటిని నుంచి బయటకు వెళ్లగొట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని ఏవీ రంగానాథ్‌ను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.