ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌ విచారణ వాయిదా

telangana High Court Held a Hearing On petition Of Field Assistant  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యూనియన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టం ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని రంగయ్య హైకోర్టుకు తెలిపారు. (ఉస్మానియా ఆస్పత్రి అంశంపై హైకోర్టులో విచారణ)

గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని అన్నారు. తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రంగయ్య కోర్టును కోరారు. పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. (ఆ విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు)

పరీక్షలపై 24న విచారణ
అలాగే.. వివిధ ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్ పరీక్షలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నీట్, జేఈఈ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిందని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ రేపు జరగనుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ నెల 24న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈనెల 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. (చట్టంలో లోపాలుంటే కేంద్రానికి నివేదించండి)

ఒక భవనంపై పిల్ ఎందుకు?
మరోవైపు జీవో 111పై సుమారు వంద పిటిషన్లు పెండింగ్ ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. కోర్టులు తెరిచాక జీవో 111 అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామని తెలిపింది. జీవో 111 ఉల్లంఘించి ఓ భవనం నిర్మిస్తున్నారని పిల్‌ దాఖలు అవ్వగా.. జీవో 111 పరిధిలో వందల నిర్మాణాలు ఉండగా, ఒక భవనంపై పిల్ ఎందుని హైకోర్టు ప్రశ్నించింది.  వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ వాడుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top