కేసీఆర్‌ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court Dissatisfied With TRS Government On Covid Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో కేసీఆర్‌ సర్కారు తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోవిడ్‌ టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని, కోర్టులో కేసున్నప్పుడే  పరీక్షలు పెంచి, తర్వాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసుల అంశంలో దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రోజుకు 50వేల కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని, సమీప భవిష్యత్తులో ఈ సంఖ్యను లక్ష వరకు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉందన్న న్యాయస్థానం..  భౌతికదూరం, మాస్కుల వంటి కరోనా మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఈ సందర్భంగా సర్కారును ఆదేశించింది. (చదవండి: గ్రేటర్‌‌ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం)

ఇక ఇందుకు స్పందించిన పీహెచ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు.. మార్గదర్శకాలు పాటించేలా హైకోర్టు ప్రజలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ గురించి అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. జిల్లా ఆస్పత్రుల్లోనూ ఆర్‌టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ సూచించిన కరోనా పరీక్షలను రాష్ట్రంలో ప్రారంభించాలని ఆదేశించింది. అదే విధంగా కరోనాపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు ఎందుకు సమర్పించడం లేదని హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి అసలు ప్రణాళిక లేదని భావించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఈనెల 24లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top