సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్–2 నియామకాలను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలు గుర్తించే పార్ట్–బీలో ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది. డబుల్ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది.
ఆరు పిటిషన్లు విచారించిన హైకోర్టు
గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్లకు పొంతనలేవన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్లెట్ నంబర్, ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇని్వజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ 2017లో నివేదిక సమర్పించింది. పార్ట్–బీలో జవాబులకు ట్యాంపరింగ్, వైట్‌నర్ వాడితే ఆ పేపర్లను మూల్యాంకనం చేయవద్దని సిఫారసు చేసింది.
కమిటీ సిఫారసులపై కొందరు సింగిల్ జడ్జి, తర్వాత ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సాంకేతిక కమిటీ సిఫారసులను పాటించాల్సిందేనని ద్వి సభ్య ధర్మాసనం 2019లో తీర్పు చెప్పింది. అయినా అందుకు విరుద్ధంగా పత్రాలను మూల్యాంకనం చేశారంటూ సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలం చెన్నాయపాలెంకు చెందిన భూక్యా ప్రియాంకతోపాటు మరికొందరు హైకోర్టులో 2019లో ఆరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం తీర్పు వెలువరించారు.
వాదనలు సాగాయిలా..
పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ఓఎంఆర్ షీట్లలో వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధం. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ట్యాంపరింగ్ జరిగిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. కీలకమైన గ్రూప్–2 అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా జరిగింది. తిరిగి మూల్యాంకనం చేసేలా కమిషన్‌ను ఆదేశించాలి. గ్రూప్–2 నియామకాలను రద్దు చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు.
కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ద్వి సభ్య ధర్మాసనం తీర్పు మేరకే కమిషన్ పరీక్షలు నిర్వహించింది. ఓఎంఆర్ షీట్లను ఆటోమేటిక్ స్కానింగ్ విధానం ద్వారా మూల్యాంకనం చేసినందున ఎవరూ జోక్యం చేసుకోవడం సాధ్యంకాదు. ఇప్పటికే ఎంపికై నియమితులైన వారంతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నియామకాలకు భంగం కలిగితే పరిపాలనా గందరగోళానికి దారితీస్తుంది. పరీక్షల్లో ఎంపిక కాని వారు కోర్టును ఆశ్రయించారు..’అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇటీవల తీర్పును రిజర్వు చేసి, మంగళవారం తీర్పు వెలువరించారు.
ఇది కమిషన్ తప్పుడు నిర్ణయమే..
‘జవాబు పత్రాల ట్యాంపరింగ్ జరిగిందని తెలుస్తున్నప్పుడు వాటిని మూల్యాకనం చేయడం కమిషన్ తప్పుడు నిర్ణయమే. నోటిఫికేషన్‌లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొని పాటించకపోవడం వైఫల్యమే. పార్ట్–బీలోని జవాబుల మూల్యాంకనంపై కమిటీ నిషేధం విధించింది. ఆటోమేటెడ్ యంత్రాల ద్వారా చేసిన మూల్యాంకనంలో లోపాలకు తావులేదన్న కమిషన్ వాదనను అనుమతించలేం.
ఓఎంఆర్ షీట్ పార్ట్–ఏ లోని ప్రశ్నల మూల్యాంకనానికి మాత్రమే హైకోర్టు, సాంకేతిక కమిటీ అనుమతించాయి. పార్ట్–బీలోని ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్‌కు ఎంతమాత్రం లేదు. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత, సమానత్వం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఇక్కడ వర్తిస్తుంది. కమిషన్ చట్టబద్ధమైన అధికార పరిధిని దాటి వ్యవహరించడాన్ని స్వాగతించలేం. 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం..’అంటూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


