సిరిసిల్ల అతలాకుతలం

Telangana: Heavy Rain Triggers Floods In Sircilla - Sakshi

వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12.8 సెం.మీ. వర్షం 

సిరిసిల్ల: నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునగగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి.

వర్షాలు, వరద సంబంధ ఘటనల్లో ఐదుగురు మృతిచెందగా ఒకరు గల్లంతయ్యారు. పలుచోట్ల పిడుగుపాట్లకు వందలాది గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పలుచోట్ల రోడ్లకు గండ్లుపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 

సిరిసిల్లలో..:భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకుతలమైంది. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్‌లో 17.76 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన సర్దార్‌నగర్, అశోక్‌నగర్, సంజీవయ్యనగర్, శాంతినగర్, సిద్ధార్థనగర్‌ జలమయమయ్యాయి. ముస్తాబాద్‌ మండలంలో ఎగువమానేరు కాల్వకు గండిపడి జనావాసాలు, పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. జిల్లాలో మానేరువాగు, మూలవాగులు పొంగిపొర్లుతున్నాయి.

రోడ్లు కోతకు గురికావడంతో వీర్నపల్లి, నిమ్మపల్లి ప్రాంతాలకు రవాణా సౌకర్యం తెగిపోయింది. మధ్యమానేరు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న యోగా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పలు జిల్లాల బాలలు అశోక్‌నగర్‌లో జలదిగ్బంధంలో చిక్కుకోగా వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

నిజామాబాద్, కామారెడ్డి విలవిల.. 
నిజామాబాద్‌: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు భారీ వర్షాలకు విలవిల్లాడుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేట్‌లో అత్యధికంగా 17.68 సెంటీమీటర్ల వర్షం కురవగా పట్టణంలోని వివిధ ప్రాంతాలు నీటమునిగాయి. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌భండార్‌ వద్ద ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని భరాడా గ్రామానికి చెందిన ప్రభు కాంబ్లే అనే యువకుడు కాలువలో పడి గల్లంతయ్యాడు.

బోధన్‌ మండలంలోని సాలూర వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మంజీర వంతెనలపై నుంచి తెలంగాణ, మహరాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం కొండాపూర్‌ గ్రామ పరిధిలోని గడ్డమీద తండా వద్దనున్న లోలెవల్‌ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డిలో వాటర్‌ ట్యాంకుపై పిడుగు పడడంతో పిల్లర్‌ పెచ్చులూడాయి.

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం ఎదులపహాడ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 152 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ పట్టణ సమీపంలో బతుకమ్మ వాగుకు వరద పోటెత్తడంతో వాగుపై నిర్మించిన వంతెన వద్ద అప్రోచ్‌ రోడ్డు కోతకు గురై పెద్ద బుంగ పడింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top