ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డాక్టర్ అయిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు పడ్డ సంతోషం మూన్నాళ్లకే ఆవిరైంది. ఎండీ కోర్సు చదువుతున్న యువడాక్టర్ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మోతె ప్రేమ్‌కుమార్–యశోద దంపతుల పెద్ద కుమార్తే రోస్లిన్(27) రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. కొంతకాలం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీలో వైద్యసేవలు అందించింది. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే రాజన్నపేటకు చెందిన సాయిబాబాను ప్రేమవివాహం చేసుకుంది.
అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎండీ కోర్సు సెకండియర్ చదువుతుంది. ఇంతలోనే గర్భం దాల్చింది. అయితే గత డిసెంబర్‌లో తీవ్ర జ్వరంతో ఇంటికొచ్చి మందులు వాడింది. అదే నెల 24న ఇంట్లో హఠాత్తుగా ఊపిరి ఆగిపోవడంతో వెంటనే సీపీఆర్ చేసి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ 4 రోజులు చికిత్స అందించారు. సుమారు రూ.7లక్షల వరకు ఖర్చు చేశారు. రికవరీ కాకపోవడంతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. మళ్లీ హైదరాబాద్‌లోని మరో హాస్పిటల్లో చేర్పించారు. 27 రోజులపాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


