గ్రేటర్‌లో పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం
మహేశ్వరం జోన్ డీసీపీ సునీత బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్‌లోని మహేశ్వరం జోన్ పరిధిలోకి వచ్చే మీర్‌ఖాన్‌పేటలో వచ్చే నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేశ్వరం జోన్ డీసీపీగా ఉన్న డి.సునీతా రెడ్డిని బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా సూపరింటెండెంట్ కె.నారాయణ రెడ్డికి మహేశ్వరం జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. కాగా.. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రేటర్‌లో తొలిసారిగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. శుక్రవారం రాష్ట్రంలో ఒకేసారి 32 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కాగా.. ఇందులో పలువురు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒక్క అధికారికీ బదిలీ కాకపోవడం గమనార్హం.
రాచకొండలో..
మల్కాజిగిరి జోన్ డీసీపీ పీవీ పద్మజ (2013)ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (అడ్మిన్) ఎస్పీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న సీహెచ్ శ్రీధర్ (2020)కు పోస్టింగ్ ఇచ్చారు. భువనగిరి ఎస్‌డీపీఓ కంకనాల రాహుల్ రెడ్డి (2021)ని భువనగిరి గ్రేడ్–1 అదనపు ఎస్పీ/ఏఎస్పీగా బదిలీ చేశారు. రాచకొండ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబును బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న కె.గుణశేఖర్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా (2018)ను బదిలీ చేసి, ఆమె స్థానంలో జయశంకర్ భూపాల్‌పల్లి ఎస్పీ ఖారే కిరణ్ ప్రభాకర్ (2017)కు అప్పగించారు. హైదరాబాద్ టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉన్న చెన్నూరి రూపేష్ (2017)ను హైదరాబాద్ సిటీ ఎస్‌ఎంఅండ్‌ఐటీ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సిటీ టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సు«దీంద్ర స్థానంలో గైఖ్వాడ్ వైభవ్ రఘునాథ్ (2018)కు పోస్టింగ్ ఇచ్చారు.


