‘జీవో 59’ దరఖాస్తులకు మోక్షం | Telangana Govt Speeds Up GO 59 Land Regularisation Process: Ponguleti Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

‘జీవో 59’ దరఖాస్తులకు మోక్షం

Oct 10 2026 3:17 AM | Updated on Oct 10 2026 3:17 AM

Telangana Govt Speeds Up GO 59 Land Regularisation Process: Ponguleti Srinivasa Reddy

నెల రోజుల్లోగా సుమారు 21 వేల దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వ నిర్ణయం 

ఉన్నతస్థాయి సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశం 

500 చ.గజాల్లోపు నిర్మాణాలనే క్రమబద్ధీకరించాలని సీసీఎల్‌ఏ, కలెక్టర్లకు ఉత్తర్వులు 

ఇప్పటికే కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ అయిన వాటినీ పునఃపరిశీలించాలని స్పష్టి కరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవో 59కి అనుగుణంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో పెట్టిన 21 వేలకుపైగా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ), జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మాణాలను క్రమబద్ధికరించేందుకు జీవో 59 ద్వారా వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌. లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న వాటికి మినహాయింపునిచ్చారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే వాటిని సమీక్షించి జీవో 59లో పేర్కొన్న నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు.  

తగిన జాగ్రత్తలు తీసుకోండి: పొంగులేటి 
ఈ ఉత్తర్వుల జారీకి ముందు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్‌. లోకేశ్‌కుమార్, స్టాంపుల ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జీవో 59 ద్వారా అనేక అక్రమాలు జరిగాయని తమ దృష్టికి రావడంతోనే ఈ జీవో అమలును నిలిపివేశామని చెప్పారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని జీవో 59లోని నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.

ఇప్పటికే కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ అయిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని తెలిపారు. నిషేధిత జాబితా (22ఏ)లోని భూముల అంశంపై ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకొస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భూమి రికార్డులు, లబ్దిదారుల అర్హత, క్రమబద్ధీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా జీవో 59 విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద అంశాల విషయంలో కోర్టుల ఆదేశాలకు లోబడే తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. 

వరుసగా పరిష్కారాలు 
నిషేధిత జాబితా (22ఏ)లోని భూములకు సంబంధించి వరుసగా ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది. ఈ భూముల విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని గత నెల 16న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఫాస్ట్‌ట్రాక్‌లో చర్యలు చేపడుతున్నారు. మంత్రి పొంగులేటి నేతృత్వంలో వారంలో రెండుసార్లు సమావేశమవుతున్న ఉన్నతస్థాయి కమిటీ ఒకొక్కటిగా ఈ అంశాలను పరిష్కరిస్తోంది.

ఇప్పటికే జీవోలు 118, 76కు మోక్షం కలిగించగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజి్రస్టేషన్లు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలకు పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకొని అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన అంశాలను కూడా త్వరగా ఓ కొలిక్కి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement