సాక్షి, యాచారం: ప్రభుత్వ, అసైన్డ్ భూములపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తున్న ఆయా మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో గుర్తించే పనిలో నిమగ్నమైంది. తాజాగా సర్కార్ ఆదేశాల మేరకు ఆయా తహసీల్దార్లు తమ మండలాల పరిధిలోని ఏయే గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్ భూములున్నాయో రికార్డులను పరిశీలిస్తున్నారు.
వివరాల సేకరణలో అధికారులు
ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తున్న సమీపంలోని మండలాల్లో భూ బ్యాంకును సిద్ధం చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, కడ్తాల్, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాల్లో భూ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు. ఆయా మండలాల్లో 250 ఎకరాలున్న గ్రామాలు, సర్వే నంబర్లను గుర్తిస్తున్నారు. ఎంత మంది అసైన్డ్ రైతులున్నారు.. కబ్జాలో ఉన్న వారెందరు.. ఆ భూములు చదునుగా ఉన్నాయా.. గుట్టలు, రాళ్లు, రప్పలతో ఉన్నాయా అనే విషయాలపై గూగుల్ మ్యాప్‌లతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలున్నాయా.. సాగుకు యోగ్యమైనది ఎంత అనే విషయాలపై భూములను పరిశీలిస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో..
ప్రభుత్వం ఫోర్త్‌సిటీని నిర్మించే విషయంలో ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేటలో వచ్చే నెల 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు తమ సంస్థల ఏర్పాటుకు అడిగిన వెంటనే కావాల్సిన భూమిని అప్పగించేందుకు అధికార యంత్రాంగం భూ బ్యాంకును సిద్ధం చేస్తోంది. యాచారం మండల పరిధిలోని యాచారం, మొండిగౌరెల్లి, చింతుల్ల, చింతపట్ల, నల్లవెల్లి, తక్కళ్లపల్లి, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించారు.
మంచాల, కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాలున్నట్లు లెక్కలు వేశారు. భూ బ్యాంకు సిద్ధంపై ఓ రెవెన్యూ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా నిజమేనని తెలియజేశారు. మరోవైపు భూ బ్యాంకు కోసం అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతుండటంతో ఆయా గ్రామాల్లోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జీవనోపాధి పొందే భూములను సేకరిస్తే బతికేది ఎలా అని ఆందోళన చెందుతున్నారు.


