
ఢిల్లీ మెట్రో విధానంలో నిర్వహణకు కసరత్తు
వాటాల బదిలీపై హెచ్‌ఎంఆర్‌ఎల్ దృష్టి
రెండో దశపై తొలగనున్న ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) సంస్థ స్వయంగా రైళ్లు నడపనుంది. ఇప్పటి వరకు మెట్రోరైళ్లను నిర్వహించిన ఎల్‌అండ్‌టీ సంస్థ వైదొలగనున్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తరహాలో హెచ్‌ఎంఆర్‌ఎల్ రైళ్ల నిర్వహణ చేపట్టే అవకాశం ఉంది. మొదటిదశ మెట్రో ప్రభుత్వం చేతిలోకి రానున్న దృష్ట్యా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఆధ్వర్యంలోనే రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో మెట్రో రైళ్ల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. అక్కడ డీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో పని చేస్తున్న యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధమైన కార్యకలాపాలను హైదరాబాద్‌లో చేపట్టనున్నట్లు సమాచారం.
మరోవైపు ఎల్‌అండ్‌టీ వైదొలగనున్నట్లు స్పష్టం కావడంతో తదుపరి చేపట్టాల్సిన కార్యకలాపాలపై కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఆ సంస్థకు ఏకమొత్తంగా చెల్లించాల్సిన రూ.2000 కోట్లతో పాటు రైళ్ల నిర్వహణ బాధ్యతల బదిలీని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌అండ్‌టీ తప్పుకోనున్న దృష్ట్యా రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వమే చెల్లించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో మెట్రో రైళ్లను ప్రభుత్వాలే నడుపుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ మాత్రమే మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా అవతరించింది. కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగనున్నందున హైదరాబాద్ మెట్రో కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం అ«దీనంలోకి రానుంది.
ఢిల్లీలో ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వేగవంతమైన, విశ్వసనీయమైన, ప్రజా రవాణా వ్యవస్థగా ఢిల్లీ మెట్రో నిలిచింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్, బహదూర్‌గఢ్ తదితర నగరాలను కలుపుతూ మెట్రో రైళ్లు సేవలందజేస్తున్నాయి.2 002లో ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. దశలవారీగా మెట్రో విస్తరణ చేపట్టారు. ప్రస్తుతం 10 లైన్లలో 450 కి.మీ.వరకు రవాణా సదుపాయాన్ని అందజేస్తోంది. ఢిల్లీ మెట్రో తర్వాత హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. ఇక్కడ విస్తరణ ముందుకెళ్లలేదు. దీంతో ప్రస్తుతం మన హైదరాబాద్ మెట్రో దేశంలో 9వ స్థానానికి పడిపోయింది.
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందజేస్తున్న డీఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు (యునైటెడ్ నేషన్స్) కూడా లభించింది. హైదరాబాద్ మెట్రో సైతం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. మొదటి దశ మెట్రోరైల్ నిర్మాణమయంలోనూ అధికారులు, నిపుణులు ఢిల్లీ మెట్రో నిర్మాణాన్ని, నిర్వహణపై అధ్యయనం చేశారు. అలాగే.. ఢిల్లీ విమానాశ్రయం వద్ద భూగర్భంలో ఉన్నట్లుగానే రెండో దశలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద కూడా అదే విధంగా భూగర్భమెట్రోరైల్ స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో నిర్వహణ తరహాలోనే హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను నడిపేందుకు తగిన కసరత్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రెండు దశల మధ్య సమన్వయానికి మార్గం..
తాజా పరిణామాల నేపథ్యంలో మెట్రో రెండోదశపై నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం లభించినట్లయింది. రెండో దశ ప్రాజెక్టును ప్రభుత్వమే చేపట్టనున్న సంగతి తెలిసిందే. మొదటిదశ మార్గాలు కూడా ప్రభుత్వం చేతిలోకి రానుండడంతో మొదటి, రెండో దశల మధ్య సమన్వయానికి మార్గం సుగమమైంది. మెట్రో రెండోదశ ‘ఎ’ విభాగంలో 76.4 కి.మీ. ‘బి’ విభాగం కింద మూడు కారిడార్‌లలో సుమారు 85 కి.మీ వరకు విస్తరించనున్నారు.
ఈ మార్గాలపై ప్రభుత్వం రెండు దఫాలుగా కేంద్రానికి డీపీఆర్‌లను అందజేసింది. కానీ.. ఎల్‌అండ్‌టీతో సమన్వయం లేని కారణంగా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. ఇప్పుడు ఎల్‌అండ్‌టీ సమస్యకు పరిష్కారం లభించిన దృష్ట్యా కేంద్రం నుంచి త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు తుదిదశకు చేరిన పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌తో రెండో దశ పనులను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక కారిడార్‌లో మెట్రో రెండోదశను పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.