TREIRB: 12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం.. అయినా ఒక్కనోటిఫికేషన్‌ లేదు

Telangana Govt Gurukul School Notifications TREIRB - Sakshi

సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 12 వేల పోస్టుల భర్తీకి గతంలోనే ప్రభుత్వ ఆమోదం  

ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వని టీఆర్‌ఈఐఆర్‌బీ 

తొలుత 9 వేల పోస్టులకు అనుమతులు.. ఉత్తర్వులు సైతం జారీ 

తర్వాత 3 వేల పోస్టులకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌.. అనుమతించని ఆర్థిక శాఖ 

అన్నిటికీ అనుమతులొచ్చిన తర్వాతే ప్రకటనలిస్తామంటున్న బోర్డు 

అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలు 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మొత్తం 12 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా..ఒక్క నోటిఫికేషన్‌ కూడా వెలువడక పోవడంతో, ఆయా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. తొలుత వివిధ కేటగిరిల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) తాత్సారం చేస్తోంది.

ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీలో భాగంగా.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రకటనలు వెలువరిస్తున్నాయి. ఈ మూడు నియామక సంస్థల పరిధిలో దాదాపు 45వేల ఉద్యోగాలకు వివిధ ప్రకటనలు జారీ చేయగా..టీఆర్‌ఈఐఆర్‌బీ మాత్రం 12 వేలకు పైగా పోస్టులకు ఇప్పటికి ఒక్క ప్రకటన కూడా జారీ చేయకపోవడం గమనార్హం.  

ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. 
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఇందులో భాగంగా గురుకుల విద్యా సంస్థల్లో 12 వేల ఖాళీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 9,096 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. ఆర్థిక శాఖ సైతం అన్ని రకాల ఉత్తర్వులను జారీ చేసింది. ఇదంతా జరిగి దాదాపు ఏడు నెలలు గడిచింది. కానీ టీఆర్‌ఈఐఆర్‌బీ మాత్రం ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదు. బోర్డు పరిధిలో అదనంగా వచ్చిన కొన్ని కొలువులకు అనుమతులు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గురుకుల విద్యా సంస్థల్లో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కాస్త ఆలస్యంగా ఆమోదం తెలిపింది. అయితే అందుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇంకా వెలువడలేదు. ఈ అంశం ప్రస్తుతం ఆ శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ 3 వేల కొలువులకు కూడా అనుమతులు వచ్చిన తర్వాత ఒకేసారి ప్రకటనలు జారీ చేస్తామని టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గురుకుల నియామకాల బోర్డు అధికారులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేయకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

గురుకులాల్లో టీజీటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. దాదాపు నాలుగు నెలలుగా నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. 
– చిట్టెల మల్లేశ్, ముజాహిద్‌పూర్, వికారాబాద్‌ జిల్లా  

రెండేళ్లుగా సిద్ధమవుతున్నా.. 
గురుకుల విద్యా సంస్థల్లో బోధన ఉద్యోగా లు, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులకు గత రెండు సంవత్సరాలుగా సిద్ధమవుతున్నా. గురుకుల ఖాళీల విష యం తెలిసిన వెంటనే ప్రైవేటు శిక్షణ కేంద్రంలో కోచింగ్‌ సైతం తీసుకున్నాను. ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌ ఉద్యోగాలు మొదలు ఇతర కేటగిరీల్లో పలు ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నా, బోధన రంగంలో ఉద్యోగాలకు ఎలాంటి ప్రకటనలు వెలువడటం లేదు. 
– మల్రెడ్డిపల్లి సుజాత, కుల్కచర్ల, వికారాబాద్‌ జిల్లా   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top