
సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న కృష్ణయ్య తదితరులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సీఎం రేవంత్
కోర్టుల్లో కేసులు పడకుండా చూడండి
సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూడాలి
బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైకోర్టు, సుప్రీంలో కేవియట్లు వేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేంతవరకు అందరం కలిసి కాపలా కాద్దామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ‘మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మా పక్షం నుంచి పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటాం. ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉంటాం. మీరు కూడా కాపలా కాయాలి. బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి’అని బీసీ సంఘాల నేతలతో సీఎం అన్నట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీచేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలు బీసీ సంఘాల నేతలు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారితో సీఎం దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆర్డినెన్స్ అనంతరం అటు రాష్ట్ర ప్రభుత్వం పరంగా, ఇటు న్యాయపరంగా చిక్కులు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు బీసీ వర్గాలు సమన్వయంతో ఉండాలని, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. న్యాయస్థానాల్లో కేసులు పడకుండా చూడాలని, ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా వాటి ప్రభావంతో నష్టం జరగకుండా ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ కేవియట్ పిటిషన్లు వేయాలని సీఎంను ఆర్.కృష్ణయ్య కోరినట్లు తెలిసింది.
కోర్టుకెళ్లినా గెలిచేది బీసీలే: ఆర్.కృష్ణయ్య
సీఎం రేవంత్‌ను కలిసిన అనంతరం ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధమైన వాటా 75 ఏళ్ల తర్వాత బీసీలకు అందుతోందని.. దీనికి ఎవరూ అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘బీసీల జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాసైనందున చట్టబద్ధత వచ్చింది. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా గెలిచేది బీసీలే. కానీ ఎవరినీ కేసులు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా కేసులు వేసినా కోర్టుల్లో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచి న్యాయవాదులను పెట్టాలి.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేసేందుకు పార్టీల పరంగా ఎవరైనా ప్రోత్సహించినట్టు తెలిస్తే వారిని బయటకు లాగుతాం. బీసీ ప్రజల కోర్టులో నిలబెట్టి ఆ పార్టీల భరతం పడతాం’అని హెచ్చరించారు. సీఎం రేవంత్‌ను కలిసిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులున్నారు. అంతకుముందు బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయం బీసీల పోరాట విజయమని పేర్కొన్నారు.