TS: ఎన్ని ‘కలల’ బడ్జెట్‌.. ఎలా ఉండబోతుంది?

Telangana Government On 2023 24 Budget Preparation - Sakshi

2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనలో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం 

సంక్షేమం, మౌలిక సదుపాయాలు, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం

సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు..

దీనికోసం రూ.12 వేల కోట్లు కేటాయించే అవకాశం

ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున రూ.1,300 కోట్లు కేటాయింపు!

వచ్చే నెల 3న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సర్కార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజారంజక బడ్జెట్‌ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధితోపాటు ‘బ్యాలెట్‌ బాక్స్‌’ పథకాలను కూడా వచ్చే ఏడాది బడ్జెట్‌లో పొందుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 3న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజు దాదాపు రూ.3 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సర్కారు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముందనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. పన్ను ఆదా యం ఆశించిన మేర వస్తుండటం, జీడీపీలో స్థిరమైన వృద్ధి నమోదవుతుండటంతో 2023–24 ఆర్థిక సంవత్సరంపై కూడా గంపెడాశలతో బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

సంక్షేమం.. సబ్సిడీలు 
రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి నుంచీ సంక్షేమ పథకాలకు తగిన ప్రాధాన్యతనిస్తోంది. ఈ కోవలోనే ఈసారీ సంక్షేమం, మౌలిక సదుపాయాలు, సాగునీటి రంగాలకు  ప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన చేస్తోంది. పింఛన్లు, దళితబంధు, రైతుబంధు, బీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి సంక్షేమ పథకాలకు నిధుల కొనసాగింపుతోపాటు సాగునీటి ప్రాజెక్టులు, రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), రాష్ట్ర రహదారులు, విద్యుత్‌ సబ్సిడీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

సాగునీటి పథకాలకు రూ.35వేల కోట్లు ప్రతిపాదించే అవకాశముంది. దీనికితోడు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.30 వేల కోట్లు, ఉద్యోగుల, జీతభత్యాల పద్దు కింద రూ.40 వేల కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.2,500 కోట్లు ప్రతిపాదించనున్నట్టు సమాచారం. వీటితోపాటు అప్పులకు వడ్డీల కింద రూ.12 వేల కోట్లు, అప్పుల చెల్లింపు కింద రూ.18వేల కోట్లు ప్రతిపాదించే అవకాశముంది.

బడ్జెట్‌లో బ్యాలెట్‌ బాక్స్‌ పథకాలు! 
ఎన్నికలే లక్ష్యంగా బ్యాలెట్‌ బాక్స్‌ పథకాలనూ ఈసారి బడ్జెట్‌లో ప్రకటిస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. అందులోభాగంగానే రాష్ట్రంలోని దాదాపు 13 వేల గ్రామపంచాయతీలకు ఒక్కోదానికి రూ.10లక్షల చొప్పున దాదాపు రూ.1,300 కోట్ల వరకు ప్రకటించే చాన్సుంది. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇచ్చే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్ధమైనందున దీనికి రూ.12వేల కోట్లు కావాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అలాగే, దళితబంధు తరహాలోనే గిరిజన బంధును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

గిరిజన బంధును ప్రకటిస్తే ఈ పద్దు కింద రూ.5వేల కోట్ల వరకు చూపించే అవకాశముంది. వీటితోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, మన ఊరు–మన బడి, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, సబ్సిడీ గొర్రెల పథకం, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఆర్టీసీకి ఆసరా లాంటి కార్యక్రమాలకూ నిధులు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం పెట్టగా, అందులో రూ.2.3 లక్షల కోట్ల వరకు సవరించిన అంచనాలు వచ్చే అవకాశముందని సమాచారం. గత బడ్జెట్‌ కంటే 15 శాతం వరకు బడ్జెట్‌ను పెంచే అవకాశముందని, అందువల్ల ఈసారి పద్దు రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

కీలక శాఖల ప్రతిపాదనలు ఇలా..
మౌలిక సౌకర్యాల కల్పనలో కీలకమైన ఆర్‌అండ్‌బీకి నిధులు పెంచే అవకాశముంది. రాష్ట్ర రహదారులకు రూ.6 వేల కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.850 కోట్లు, ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగంలో (సంగారెడ్డి–చౌటుప్పల్‌) భూసేకరణ కోసం రూ.2,500 కోట్లు కావాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయిస్తుండగా, ఈసారి కొత్త బస్సులు కొనాల్సిన పరిస్థితుల్లో బడ్జెట్‌ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశిస్తున్నారు.

గత బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించిన పంచాయతీరాజ్‌ శాఖకు ఈసారి రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ ప్రతిపాదించింది. ఆసరా పింఛన్ల కింద రూ.14 వేల కోట్లు, వడ్డీలేని రుణ పథకానికి రూ.3 వేల కోట్లు కావాలని కోరింది.  రూ.15 వేల కోట్లు కేటాయించాలని ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.

నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం విధించిన ఆంక్షలతో ఏడాది కాలంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనుల్లో వేగం తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఇప్పటికే వాటి కోసం తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం రూ.35 వేల కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది.

కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలకు అసలుతోపాటు వడ్డీల చెల్లింపులకు గతేడాది రూ.12 వేల కోట్ల వ్యయమైందని, ఈ ఏడాది రుణాలు, వడ్డీల చెల్లింపులకు వ్యయం మరింత పెరిగి రూ.14 వేల నుంచి రూ.15 వేల కోట్లకు పెరగనున్నట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పరిహారం చెల్లింపులకు మరో రూ. 5 వేల కోట్లు కోరినట్టు తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.4వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.500 కోట్లు కేటాయించనున్నట్టు సమాచారం.

విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు!
విద్యుత్‌ సబ్సిడీల కింద రూ.10,535 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని ఇంధన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రస్తుత విద్యుత్‌ చార్జీలనే 2023–24లో కొనసాగించాలని, ఎలాంటి పెంపు అమలు చేయరాదని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. ప్రస్తుత చార్జీల కొనసాగింపుతో రూ.10,535 కోట్ల ఆదాయ లోటు ఉండనుందని, ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఆమేరకు నిధులు కేటాయించాలని కోరాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తోపాటు వివిధ కేటగిరీల వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్‌ రాయితీ పథకాలను కొనసాగించడానికి సబ్సిడీలు అవసరం కానున్నాయి. విద్యుత్‌ సబ్సిడీలతోపాటు ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ బిల్లుల కోసం రూ.13 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని ఇంధన శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top